దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విలయ తాండవం చేస్తుంది. కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా గురువారం ఒక్కరోజే 15,097 కొత్త కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఆరు మరణాలు కూడా నమోదయ్యాయి. కరోనా పాజిటివిటీ రేటు కూడా 15.34 శాతానికి పెరిగింది. తాజా కేసులతో ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 14,89,463కి చేరుకోగా.. మరణాల సంఖ్య 25,127కి పెరిగింది. ప్రస్తుతం రాజధానిలో యాక్టివ్ కేసుల సంఖ్య 31,498కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో దాదాపు లక్ష కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగాయి.
కోవిడ్-సంబంధిత అన్ని ప్రోటోకాల్‌లకు ప్రజలు కట్టుబడి ఉండాలని ప్రభుత్వాలు చెబుతున్నా ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఆందోళన కలిగించే విషయం. బుధవారం నాడు రాజధానిలో 11.88 శాతం పాజిటివ్ రేటుతో 10,665 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ మాట్లాడుతూ.. దేశ రాజధానిలో గురువారం 14,000 కేసులు నమోదు అవుతాయని అన్నారు. అయితే.. నగరంలో ప్రస్తుతం కోవిడ్ పరిస్థితి అదుపులో ఉందని అన్నారు. భారతదేశంలో థర్డ్ వేవ్ ఏర్పడిందని.. "ఢిల్లీకి ఇది పిప్త్ వేవ్" అని మంత్రి జైన్ అన్నారు.