ఆమె దేశ ప్రతిష్టను దెబ్బతీసింది.. మాజీ ఐఏఎస్ ట్రైనీ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు
ఓబీసీ, వికలాంగుల కోటా ప్రయోజనాలను అక్రమంగా పొంది మోసం చేసిన కేసులో నిందితురాలు, మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
By Medi Samrat Published on 23 Dec 2024 10:51 AM GMTఓబీసీ, వికలాంగుల కోటా ప్రయోజనాలను అక్రమంగా పొంది మోసం చేసిన కేసులో నిందితురాలు, మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. పూజా ఖేద్కర్ కుట్ర పన్నారని, దేశ ప్రతిష్టను దెబ్బతీశారని జస్టిస్ చంద్ర ధారి సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. గతంలో పూజకు ఇచ్చిన మధ్యంతర అరెస్టు రక్షణను కూడా కోర్టు తొలగించింది. ఆగస్ట్ నెలలో పూజా ఖేద్కర్‌కు అరెస్టు నుండి కోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. జూలై 31న, UPSC ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. భవిష్యత్తులో జరిగే అన్ని పరీక్షలు, కమిషన్ ఎంపికల నుండి ఆమెను శాశ్వతంగా డిబార్ చేసింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2022 నిబంధనలను ఉల్లంఘించినందుకు UPSC ఆమెను దోషిగా నిర్ధారించింది.
అంతకుముందు ట్రయల్ కోర్టు ఖేద్కర్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. ఈ కేసులో దర్యాప్తు పరిధిని విస్తరించాలని.. పూర్తి నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించాలని దర్యాప్తు సంస్థను ఆదేశించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించిన ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని ఖేద్కర్ సవాలు చేశారు. ఆ నకిలీ పత్రాలను పొందేందుకు పూజా కుటుంబం అధికారులతో కుమ్మక్కయి ఉండే అవకాశం ఎక్కువగా ఉందని కోర్టు పేర్కొంది. దర్యాప్తును తారుమారు చేయగల పూజా సామర్థ్యాన్ని పేర్కొంటూ.. యుపీఎస్సీని మోసం చేయడం పిటిషనర్ పెద్ద కుట్రలో భాగమని కోర్టు పేర్కొంది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు ఇతర వెనుకబడిన తరగతి (OBC) మరియు వికలాంగుల కోటాను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఈ కేసులో ఖేద్కర్‌పై యూపీఎస్సీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. విచారణ అనంతరం యూపీఎస్సీ ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. అనంతరం ఆమెకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. ఆపై ఆమె భవిష్యత్తులో ఎటుంటి పరీక్షలకు హాజరుకాకుండా కూడా నిషేధించబడింది. UPSC ప్రకటన ప్రకారం, ఖేద్కర్ తన పేరును, తన గుర్తింపును తప్పుగా సూచించడం ద్వారా పరీక్ష నిబంధనలను ఉల్లంఘించినట్లు వెల్లడైంది. ఖేద్కర్ తన తల్లిదండ్రుల పేర్లతో పాటు ఆమె ఫోటో, సంతకం, ఈమెయిల్ చిరునామా, మొబైల్ నంబర్, చిరునామాను కూడా మార్చినట్లు ప్రకటన పేర్కొంది.