ఇక క‌రోనా ఆంక్షలు లేనట్లే..

Delhi govt ends all COVID-19 restrictions. కరోనా ఆంక్షలకు మినహాయింపులు ఇస్తున్నట్టు కేంద్రం తెలిపింది. రాత్రి పూట కర్ఫ్యూలను సడలించాలని

By Medi Samrat  Published on  26 Feb 2022 8:03 AM GMT
ఇక క‌రోనా ఆంక్షలు లేనట్లే..

కరోనా ఆంక్షలకు మినహాయింపులు ఇస్తున్నట్టు కేంద్రం తెలిపింది. రాత్రి పూట కర్ఫ్యూలను సడలించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. కోవిడ్ తీవ్రత తగ్గుతున్న నేపథ్యంలో ఆంక్షలను సడలిస్తున్నట్టు కేంద్ర హోం సెక్రటరీ అజయ్ భల్లా తెలిపారు. స్థానిక పరిస్థితులను బట్టి ఆంక్షలను అమలు చేయాలని రాష్ట్రాలు, యూటీలకు ఆయన సూచించారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రజలు అన్ని జాగ్రత్తలను యథావిధిగా పాటించాలని ఆయన కోరారు. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఇళ్లు, అన్ని చోట్ల సరైనంత వెంటిలేషన్ వచ్చేలా చూసుకోవడం చేయాలని చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగించాలని తెలిపారు.

ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అన్ని COVID-19 ఆంక్షలను ఎత్తివేసింది. సోమవారం నుంచి ఢిల్లీలో రాత్రిపూట కర్ఫ్యూ ఎత్తివేయనున్నారు. ఏప్రిల్ 1 నుండి తరగతుల హైబ్రిడ్ మోడ్‌ను తొలగించాలని పాఠశాలలకు తెలిపింది ఢిల్లీ ప్రభుత్వం. మాస్కులు ధరించకుంటే జరిమానా రూ.2000 నుంచి రూ.500కి తగ్గిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధ్యక్షతన జరిగిన DDMA సమావేశంలో ఢిల్లీలోని అన్ని కోవిడ్-19 నియంత్రణలను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్, రెవెన్యూ మంత్రి కైలాష్ గెహ్లాట్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, ఆరోగ్య శాఖ అధికారులు సహా ఢిల్లీ ప్రభుత్వ ముఖ్య మంత్రులు హాజరయ్యారు. "రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, ఇతర కార్యకలాపాలకు సంబంధించిన సమావేశాలు మినహా, కోవిడ్ పరిస్థితి గణనీయంగా మెరుగుపడినందున మిగిలిన ఆంక్షలు ఎత్తివేయబడతాయని భావిస్తున్నారు" అని ఢిల్లీ ప్రభుత్వ అధికారి ఒకరు గతంలో వార్తా సంస్థ PTI కి చెప్పారు.

చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీతో సహా చాలా మంది వ్యాపారుల సంస్థలు, నగరంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో కోవిడ్-19 పరిమితులలో సడలింపు కోరుతూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ని సంప్రదించారు. దేశ రాజధానిలోని దేవాలయాలు, ఇతర మతపరమైన ప్రదేశాలకు భక్తులను, సందర్శకులను అనుమతించాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా బైజల్‌కు లేఖ రాశారు.


Next Story