ఢిల్లీ ప్రభుత్వం గెస్ట్ టీచర్ల వేతనాన్ని పెంచాలని నిర్ణయించింది. గెస్ట్ టీచర్ల జీతాల పెంపుదల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గురువారం తెలిపారు. గెస్ట్ టీచర్ల వేతనాన్ని పెంచాలని "డిల్లీ అతిథి శిక్షక్ సంఘ్" ప్రతినిధి బృందం నిన్న ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ మరియు కాంట్రాక్ట్ టీచర్ల వేతనాన్ని పెంచాలని ఢిల్లీ ప్రభుత్వం విద్యా శాఖ డైరెక్టరేట్‌ను ఆదేశించింది. ఈ విషయమై మనీష్ సిసోడియా సోషల్ మీడియాలో స్పందిస్తూ.. "అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తమకు ఎలా గౌరవం, గుర్తింపునిచ్చిందనే విషయమై వారి అనుభవాలను పంచుకోవడానికి కొంతమంది గెస్ట్ టీచర్లు నిన్న నన్ను కలవడానికి వచ్చారు. వారు జీతం పెంచాలని అభ్యర్థించారు. ఢిల్లీ ప్రభుత్వం ఈ ప్రక్రియను ప్రారంభించింది. గెస్ట్ టీచర్ల జీతాలు పెంపు ప్రక్రియ ప్రారంభమైనందుకు సంతోషంగా ఉందని అన్నారు.
ఈ మేరకు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. గెస్ట్ మరియు కాంట్రాక్ట్ టీచర్ల వేతనాన్ని పెంచాలని డెరైక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను ఆదేశించింది. కోవిడ్ కారణంగా అనేక కుటుంబాల్లో ఆర్థికంగా కష్టాలు పెరగాయి. జీవన వ్యయం పెరగడం వల్ల వేతనాలలో పునరుద్ధరణ అవసరమని వారి అభిప్రాయాన్ని అంగీకరిస్తున్నామని ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ మరియు కాంట్రాక్ట్ టీచర్లందరి వేతనాన్ని పెంచే ప్రతిపాదనను సమర్పించాలని అధికారులను కోరింది. ఇది వారి జీవితాన్ని గౌరవంగా జీవించడానికి మరియు వారి సేవలను హృదయపూర్వకంగా అందించడానికి వీలు కల్పిస్తుందని అధికారిక ఉత్తర్వులో పేర్కొంది.