ఆ ఏడుగురు మహిళలు ఎలాంటి తప్పు చేయలేదు

గత ఏడాది పొట్టి దుస్తులు ధరించి బార్‌లో అశ్లీల నృత్యాలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు మహిళలను ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

By Medi Samrat
Published on : 12 Feb 2025 3:04 PM IST

ఆ ఏడుగురు మహిళలు ఎలాంటి తప్పు చేయలేదు

గత ఏడాది పొట్టి దుస్తులు ధరించి బార్‌లో అశ్లీల నృత్యాలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు మహిళలను ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఏడుగురు మహిళలను నిర్దోషులుగా ప్రకటిస్తూ, షార్ట్‌లు ధరించడం లేదా డ్యాన్స్ చేయడం నేరం కాదని కోర్టు పేర్కొంది.

గత ఏడాది ఢిల్లీలోని పహార్‌గంజ్‌లో బార్‌లో మహిళలు అశ్లీలంగా డ్యాన్స్ చేశారని ఆరోపిస్తూ కేసు నమోదైంది. అయితే, సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) నీతూ శర్మ మహిళలను నిర్దోషులుగా ప్రకటించింది. పొట్టి బట్టలు ధరించి డ్యాన్స్ చేయడం నేరం కాదని, అలాంటిది బహిరంగంగా చేసినా తప్పు కాదని కోర్టు అభిప్రాయపడింది. అయితే, ఆ డ్యాన్స్ కారణంగా ఇతర ప్రజలకు చికాకు కలిగిస్తే, అది శిక్షార్హమైనదిగా పరిగణించబడుతుందని కోర్టు తెలిపింది.

ధర్మేందర్ అనే సబ్ ఇన్‌స్పెక్టర్‌ వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేశారు. తాను పెట్రోలింగ్‌లో ఉన్నప్పుడు పొట్టి బట్టలు వేసుకుని కొందరు అమ్మాయిలు అసభ్యకరమైన పాటలపై డ్యాన్స్ చేయడం తాను చూశానని అన్నారు. అయితే ఆ డ్యాన్స్ వల్ల ప్రజలు చిరాకు పడ్డారని మాత్రం చెప్పలేదు. డ్యాన్స్ చుట్టుపక్కల వారికి చికాకు కలిగించిందని ప్రాసిక్యూషన్ పేర్కొన్నప్పటికీ, దానిని నిరూపించడంలో విఫలమైంది.

Next Story