ఆయన క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించాం.. కానీ..!
Defence Chief General Bipin Rawat. బుధవారం నాడు తమిళనాడులోని కూనూరు వద్ద ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో
By Medi Samrat Published on 8 Dec 2021 7:02 PM IST
బుధవారం నాడు తమిళనాడులోని కూనూరు వద్ద ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో భారత రక్షణ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ మరణించారు. మిలిటరీ హెలికాప్టర్ కూలి 13 మంది మృతి చెందగా.. ఓ వ్యక్తి తీవ్రంగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడు. రావత్ మృతిని భారత వాయుసేన కొద్దిసేపటి కిందట ధ్రువీకరించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ అని భారత వాయుసేన ప్రకటించింది. రావత్ మరణంతో సైనిక వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన బతికే ఉంటారని పలువురు ఆశించారు. కానీ ఆయన మరణించారనే చేదువార్త తెలిసింది. బిపిన్ రావత్ మరణాన్ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ధృవీకరించింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో మొత్తం 14 మంది ఉండగా.. 13 మంది మరణించారు. తీవ్రంగా గాయపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు
వెల్లింగ్టన్‌లో జరిగే ఆర్మీ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు రావత్, ఆయన భార్య, మరో 12 మందితో కలిసి ఉదయం 11.40 గంటల ప్రాంతంలో బయలుదేరారు. వెల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఈ ఎంఐ సిరీస్ హెలికాప్టర్.. కాసేపటికే కూనురు సమీపంలో కూలిపోయింది. ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి ఉదయం 11.45 గంటలకు నీలగిరి కొండల్లోని వెల్లింగ్‌టన్‌కు హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీకి ఆ విమానం బయలుదేరింది. మరో 10 నిమిషాలలో ల్యాండ్ అయ్యే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రమాదానికి కారణం వాతావరణం సరిగా లేకపోవడమా…సాంకేతిక లోపమా? అన్నది తేలాల్సి ఉంది.