తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం కారణంగా మరణించిన వారి సంఖ్య 57కి చేరుకుంది. విషపూరిత మద్యం సరఫరా చేసిన ప్రధాన నిందితుడిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిథనాల్‌తో కూడిన మద్యం తాగడం వల్లే వీరు మరణించారని చెబుతున్నారు. మృతుల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. ఈ ఘటన జూన్ 19న వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులను లేదా వారిలో ఒకరిని కోల్పోయిన పిల్లల పూర్తి విద్య, హాస్టల్ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని కూడా ప్రకటించింది.
మరోవైపు ఈ విషయంలో విపక్షాలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. కాంగ్రెస్ మౌనాన్ని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంబిత్ పాత్ర ప్రశ్నించారు. తమిళనాడు మద్యం దుర్ఘటనపై మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక, సోనియా గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనను ప్రాయోజిత హత్యగా సంబిత్ పాత్రా అభివర్ణించారు.