ర‌హ‌దారులపై మృత్యుఘోష‌.. 10 రోజుల్లో 60కి పైగా మరణాలు..!

గత కొన్ని రోజులుగా, దేశంలోని అనేక ప్రాంతాలలో బాధాకరమైన రోడ్డు ప్రమాదాల వార్తలు వెలువడుతున్నాయి.

By -  Medi Samrat
Published on : 3 Nov 2025 6:01 PM IST

ర‌హ‌దారులపై మృత్యుఘోష‌.. 10 రోజుల్లో 60కి పైగా మరణాలు..!

గత కొన్ని రోజులుగా, దేశంలోని అనేక ప్రాంతాలలో బాధాకరమైన రోడ్డు ప్రమాదాల వార్తలు వెలువడుతున్నాయి. ఇది అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సంఘటనలలో ఒకరి తండ్రి మరణించారు. మరొకరి తల్లి తన బిడ్డను కోల్పోయింది. ఇది మాత్రమే కాదు.. కొన్ని సంఘటనలలో మొత్తం కుటుంబాలు నాశనం అయ్యాయి. దేశంలో రోడ్డు ప్రమాదాల వెనుక అనేక కారణాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఓవర్ స్పీడ్, ఓవర్‌టేకింగ్ ప్రధాన కారణం క‌గా.. కొన్నిసార్లు డ్రంక్ అండ్ డ్రైవింగ్ కార‌ణ‌మ‌వుతున్నాయి. ఒకరి తప్పిదానికి ఒకట్రెండు కుటుంబాలే కాదు.. చాలా మంది భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోవడంతో పాటు వృద్ధులైన తల్లిదండ్రులు కూడా నిస్సహాయులుగా మారుతున్నారు.

నవంబర్ 3 సోమవారం రాజస్థాన్‌లోని జైపూర్ నుండి ఘోర రోడ్డు ప్రమాదం వార్త వచ్చింది, అక్కడ ఒక డంపర్ 17 వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా, 18 మంది గాయపడినట్లు సమాచారం. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో రోడ్డు నెం.14 నుంచి వస్తున్న డంపర్ పెట్రోల్ పంపు సమీపంలో హైవేలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టింది.

కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నుంచి కూడా ఇలాంటి రోడ్డు ప్రమాదం వార్త బయటకు రావడం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. కర్నూలులో బస్సు అగ్ని ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. బస్సు కింద మోటార్ సైకిల్ ఇరుక్కుపోయి నిప్పురవ్వలు లేచి మంటలకు కారణమయ్యాయ‌ని పోలీసుల విచారణలో తేలింది. బస్సులో 43 మంది ఉన్నారు. బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం.. బస్సులోని బ్యాటరీ, మొబైల్ ఫోన్లు మంటలకు మరింత ఆజ్యం పోశాయి.

ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత రాజస్థాన్‌లోని జైపూర్ నుండి కూడా ఒక భయంకరమైన ప్రమాద వార్తలు వచ్చింది. అక్కడ ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సు మంటల్లో చిక్కుకోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. 10 మంది గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌ నుంచి ఇటుక బట్టీలో పని చేసేందుకు వెళ్తున్న 50 మందికి పైగా కూలీలు బ‌స్సులో ఉన్నారు.

నవంబర్ 2, ఆదివారం రాజస్థాన్‌లోని ఫలోడి ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది, అక్కడ టెంపో ట్రావెలర్, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 15 మంది మరణించారు. మృతులంతా జోధ్‌పూర్‌లోని సుర్‌సాగర్ ప్రాంతంలో నివసించేవారు, వీరు కోలాయత్ ఆలయాన్ని సందర్శించి తిరిగి వస్తున్నారు.

అదే సమయంలో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఈరోజు ఉదయం మరో పెను ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) బస్సును కంక‌ర టిప్ప‌ర్‌ ఢీకొనడంతో 20 మంది మృతి చెందారు. మృతుల్లో 10 మంది మహిళలు, 10 నెలల చిన్నారి, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. ఈ ఘటనపై వెంట‌నే స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Next Story