కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నందుకే తన కూతురుపై కాంగ్రెస్ కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తోందని అన్నారు. గోవాలో స్మృతి ఇరానీ కూతురు జోయిష్ అక్రమంగా బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. మరణించిన ఒక వ్యక్తి పేరుతో లైసెన్స్ పొంది గోవాలో అక్రమంగా బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు తేలిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. దీనికి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ.. స్మృతి ఇరానీని మంత్రి వర్గంలోంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఆరోపణలపై స్మృతి ఇరానీ స్పందిస్తూ.. నా పద్దెనిమిదేళ్ల కూతురు కాలేజీలో చదువుకుంటోంది. ఆమె ఎలాంటి బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహించడం లేదు. ఒకసారి ఆమె పేరు ఉన్నట్లు చెబుతున్న పత్రాలు పరిశీలించండి. అందులో ఆమె పేరు ఎక్కడుంది? ఆర్‌టీఐ ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా నా కూతురుపై అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. నా కూతురు రాజకీయ నాయకురాలు కాదు. తనొక సాధారణ విద్యార్థిని. తన వ్యక్తిత్వం దెబ్బతినేలా చేసినందుకు కాంగ్రెస్ నేతలే బాధ్యులని అన్నారు. నా కూతురు చేసిన తప్పు ఒక్కటే… అది ఆమె తల్లి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గురించి మాట్లాడటమేనని ఆమె ఆరోపించారు.