కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర మంత్రివర్గం గుడ్ న్యూస్ తెలిపింది. గత ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం (డీఏ) పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తాజాగా కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. ఏడో వేతన సవరణ సంఘం సిఫారసుల మేరకు డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ పెంచిన డీఏ 2021, జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.
డియర్‌నెస్ అలవెన్స్(డీఏ)ను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెంచిన డీఏను 2021 జులై నెలనుంచి అమలు చేయనున్నారు. గతేడాది పెంచిన డీఏను నిలిపివేస్తూ వస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ తాజాగా డీఏను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కేబినెట్ నోటు విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు మూడు విడతల డీఏ పెండింగ్‌లో ఉంది. జనవరి 1, 2020 నుండి జూన్ 30, 2020 వరకు- 4%, జూలై 1, 2020 నుండి డిసెంబర్ 31, 2020 వరకు – 3%, జనవరి 1, 2021 నుండి జూన్ 30, 2021 వరకు 4% డీఏ పెండింగ్‌లో ఉంది. డీఏ పునరుద్ధరణతో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చేతికి అందే జీతం, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీలో కూడా పెద్ద మొత్తంలో లాభం పొందే అవకాశం కనిపిస్తోంది. జనవరి 1, 2020 నుండి ప్రభుత్వం డీఏ బకాయిలను చెల్లిస్తుందో లేదో ఇంకా స్పష్టత రాలేదు. ఈ బకాయిల చెల్లింపు ఖజానాపై అధిక భారం పడనుంది.