మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి చెందారు. ఈ ఘటన ముంబై సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో సైరస్ మిస్త్రీ మెర్సిడెస్ కారులో అహ్మదాబాద్ నుంచి ముంబైకి వెళుతున్నారు. పాల్ఘర్ ఎస్పీ బాలాసాహెబ్ పాటిల్.. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుండి తిరిగి వస్తుండగా వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ మరణించినట్లు ధృవీకరించారు. గుజరాత్-మహారాష్ట్ర సరిహద్దులో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో మరణించిన రెండో వ్యక్తిని జహంగీర్ దిన్‌షా పండోల్‌గా గుర్తించారు. మరో ఇద్దరు ప్రయాణికులు అనహిత పండోల్, డారియస్ పండోల్ గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జహంగీర్ పండోల్ భార్య డాక్టర్ అనహిత పండోలే కారు నడుపుతున్నారు. డాక్టర్ అనహిత పండోల్ దక్షిణ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్.
ప్రమాదం తరువాత, గాయపడిన ఇద్దరినీ మహారాష్ట్రలోని కాసాలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారిని గుజరాత్‌లోని వాపిలోని రెయిన్‌బో ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. తదుపరి చికిత్స కోసం అనాహిత పండోల్‌ను బ్రీచ్ కాండీ హాస్పిటల్‌కు తీసుకువెళ్లనున్నట్లు వర్గాలు తెలిపాయి.
డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో వంతెనపై ఉన్న డివైడర్‌ను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. లగ్జరీ కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. సైరస్ మిస్త్రీ అక్కడికక్కడే మృతి చెందాడు. "ప్రాథమిక విచారణలో డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోయారని తేలింది. ఇద్దరు వ్యక్తులు మరణించారు.. మిగిలిన ఇద్దరు ఆసుపత్రిలో ఉన్నారు" అని ఎస్పీ ధృవీకరించారు.