తీవ్రమౌతున్న తౌక్టే తుఫాను

Cyclone Tauktae set to intensify. ఒకవైపు కరోనాతో దేశం అల్లాడిపోతుంటే.. దానికి తోడుగా తుఫాన్ కూడా అతలా కుతలం చెయ్యబోతోంది.

By Medi Samrat  Published on  15 May 2021 10:48 AM GMT
తీవ్రమౌతున్న తౌక్టే తుఫాను

ఒకవైపు కరోనాతో దేశం అల్లాడిపోతుంటే.. దానికి తోడుగా తుఫాన్ కూడా అతలా కుతలం చెయ్యబోతోంది. కేరళలోని కొచ్చి తీరానికి దగ్గరలో ఏర్పడ్డ తౌక్టే తుఫాను... ఇవాళ భీకర తుఫానుగా మారబోతోందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే లక్షద్వీప్ వద్ద ఏర్పడిన అల్పపీడనం ఎఫెక్ట్ తో కేరళలోని పలు జిల్లాలలో 20 సెంటమీటర్ ల వర్షపాతం నమోదయింది. దీంతో భారత వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ ప్రకటించింది.

తౌక్టే తుఫాన్ ప్రభావం ఐదు రాష్ట్రాలపై ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కేర‌ళ‌ తో పాటూ గుజ‌రాత్, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్రపై కూడా దీని ప్ర‌భావం ఉంటుంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా దాదాపు 50 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు చేరుకున్నాయి. మరోవైపు నావికా దళం కూడా రంగంలోకి దిగింది.

తుఫాన్ ప్రభావంతో వచ్చే ఆదివారం వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో కొండచరియలు విరిగిపడటం,వరదలు పోటెత్తే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించింది. తుఫాన్ నేపథ్యంలో మత్స్యకారులెవరూ అరేబియా సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించింది. టూరిజం కార్యకలాపాలపై కూడా ఆంక్షలు విధించారు.

అలాగే తుపాన్ ప్రభావం పలు విమాన సర్వీసులపై పడనుంది. తుపాన్ ప్రభావం వల్ల తమ విమాన సర్వీసుల రాకపోకలను రద్దు లేదా రీ షెడ్యూల్ చేస్తున్నామని విస్తారా, ఇండిగో సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. చెన్నై, తిరువనంతపురం, కొచ్చి, బెంగళూరు, ముంబై, పూణే, గోవా, అహ్మదాబాద్ నగరాలకు విమాన సర్వీసులు మే 17వతేదీ వరకు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని అభిప్రాయ పడ్డాయి.
Next Story
Share it