దానా తుఫాన్ ఎఫెక్ట్.. 40 విమానాలు, 750 రైళ్లు రద్దు..!
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను ఒడిశా తీరాన్ని తాకింది.
By Medi Samrat Published on 25 Oct 2024 8:30 AM ISTఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను ఒడిశా తీరాన్ని తాకింది. తుపాను కారణంగా ఒడిశాలోని పలు చోట్ల భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తున్నాయి. చాలా చోట్ల నేలకొరిగిన చెట్ల చిత్రాలు కూడా బయటపడ్డాయి. భారత వాతావరణ శాఖ ప్రకారం.. అక్టోబర్ 24, 25 మధ్య రాత్రి 'దానా' తుఫాను రాక ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా. IMD ప్రకారం.. తుఫాను పారాదీప్ (ఒడిశా)కి తూర్పు-ఈశాన్యంగా 50 కి.మీ.. ధామ్రా (ఒడిషా)కి 40 కి.మీ దక్షిణ-ఆగ్నేయంగా సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) నైరుతి దిశలో 160 కి.మీ దూరంలో ఉంది.
ఒడిశాలో 385 రెస్క్యూ టీమ్‌లను మోహరించారు. 20 NDRF, 51 ODRAF, 220 అగ్నిమాపక దళ బృందాలు, 95 ఒడిశా ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బృందాలు కూడా మోహరించబడ్డాయి. 60 బ్లాక్‌లు, 2,131 గ్రామాలు, 12 పట్టణ స్థానిక సంస్థలు, వివిధ పట్టణ స్థానిక సంస్థలలో 55 వార్డుల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. 4,756 తుపాను సహాయ కేంద్రాలు పనిచేస్తున్నాయి. 6,454 పెంపుడు జంతువులను సహాయక కేంద్రాలకు తరలించారు. 213 వైద్య బృందాలను కూడా నియమించారు. 120 పశువైద్య బృందాలను కూడా నియమించారు. ఒడిశాలో ఇప్పటివరకు మూడు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 7,000 పైగా శిబిరాలు ఏర్పాటు చేశారు. 2,300 మందికి పైగా గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గత ఆరు గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్నట్లు ఐఎండీ డైరెక్టర్ మనోరమా మొహంతి తెలిపారు. ఇది రాగల 3-4 గంటల్లో వాయువ్య దిశగా పయనించి ఉత్తర ఒడిశా తీరం, పూరీ, సాగర్ ద్వీపం మధ్య పశ్చిమ బెంగాల్ తీరం దాటే అవకాశం ఉంది. కోల్‌కతా, హుగ్లీ, పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాలతో సహా మొత్తం దక్షిణ బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరిక జారీ చేసింది. రాగల 48 గంటల్లో ఇక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒడిశాలో 20 బృందాలు, పశ్చిమ బెంగాల్‌లో 17 బృందాలను మోహరించినట్లు ఎన్‌డిఆర్‌ఎఫ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ మొహసేన్ షాహెదీ తెలిపారు. కోల్‌కతా ఓడరేవును మూసివేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ దళానికి చెందిన 13 బెటాలియన్లను బెంగాల్‌లో మోహరించారు.
దానా తుఫాను అత్యంత వేగంతో కదులుతోంది. కొన్ని చోట్ల గాలి వేగం 120 కి.మీపై ఉంది. తుపాను కారణంగా 750కి పైగా రైళ్లు, 400 విమానాలు రద్దయ్యాయి. బెంగాల్‌లో 550, ఒడిశాలో 203 రైళ్లను రద్దు చేశారు. భువనేశ్వర్ విమానాశ్రయంలో గురువారం 40 విమానాలు రద్దు చేయబడ్డాయి.