2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు I-N-D-I-A కూటమిగా ఏర్పడిన విషయం తెలిందే. 26 పార్టీల కూటమికి I-N-D-I-A గా పేరు పెట్టడం ద్వారా ప్రతిపక్ష పార్టీలు సరైన పనే చేశాయని దాదాపు సగం మంది భారతీయులు అభిప్రాయపడుతున్నారని ప్రముఖ పోల్ ఏజెన్సీ సీ-ఓటర్ నిర్వహించిన ప్రత్యేక సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తోంది.
ప్రతిపక్షాల కూటమికి I-N-D-I-A అని పేరు పెట్టడం సరైనదా..? లేదా.? అని సర్వేలో ప్రశ్నించగా.. ఓవరాల్ గా 48.6 శాతం మంది ఇది సరైన నిర్ణయమని చెప్పారు. 38.8 శాతం మంది తప్పుడు నిర్ణయమని పేర్కొన్నారు. 12 శాతం మంది 'తెలియదు' అని సమాధానం ఇచ్చారు.
లోక్‌సభ ఎన్నికలు-2024 జరగడానికి ఒక సంవత్సరం కంటే తక్కువ సమయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. బెంగళూరులో జూలై 17-18 తేదీల్లో జరిగిన ప్రతిపక్ష పార్టీల రెండో సమావేశంలో ఈ కూటమికి I-N-D-I-A అని పేరు పెట్టారు. సీ-వోటర్ దీనికి సంబంధించి ఆల్ ఇండియా సర్వే చేసింది.