వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లలో త్వరలో ఆ వివరాలు కూడా.. కారణం ఇదే..!

CoWin certificate to mention date of birth of fully vaccinated going abroad. కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ విషయమై ఇటీవల భారత్‌కు, బ్రిటన్‌కు మధ్య చెలరేగిన

By అంజి  Published on  25 Sep 2021 2:38 PM GMT
వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లలో త్వరలో ఆ వివరాలు కూడా.. కారణం ఇదే..!

కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ విషయమై ఇటీవల భారత్‌కు, బ్రిటన్‌కు మధ్య చెలరేగిన వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. వ్యాక్సినేషన్‌ పూర్తైన తర్వాత కేంద్రం అందిస్తున్న కొవిన్‌ సర్టిఫికెట్‌లో మరికొన్ని ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. వరల్డ్ హెల్త్‌ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) నిబంధనలకు అనుగుణంగా కోవిన్‌లో ఈ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టబడుతుంది, ఇది వచ్చే వారం నుండి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు సర్టిఫికేట్ జారీ చేసేటప్పుడు కేవలం వ్యక్తి వయస్సును మాత్రమే నమోదు చేస్తుండగా.. దీనికి పరిష్కారం ఆలోచించిన కేంద్రం పుట్టిన తేదీతో కూడిన వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంతో వ్యాక్సిన్ వేసుకుని విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఎలాంటి చిక్కులు ఉండవని ఓ అధికారి తెలిపారు.

భారత్‌లో తయారైన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌పై మొదట అభ్యంతరం వ్యక్తం చేసిన బ్రిటన్‌.. ఆ తర్వాత భారత్‌ విమర్శలతో వెనక్కి తగ్గింది. తమకు కోవిషీల్డ్ వ్యాక్సిన్‌పై ఎలాంటి అభ్యంతరం లేదని వ్యాక్సిన్‌ సర్టిఫికేట్ విషయంలో పలు అనుమానాలున్నాయని వాదించింది. కరోనా వ్యాక్సిన్ సర్టిఫికేట్ విషయంలో కనీస ప్రమాణలుండాలని వ్యాఖ్యనించింది. తాము కోవిన్ యాప్, ఎన్‌హెచ్‌ఎస్‌ యాప్‌ల రూపకర్తలతో వివరణాత్మక చర్చలు జరుపుతున్నామని బ్రిటన్ హై కమిషనర్ అలెక్స్‌ ఎల్లిస్‌ తెలిపారు. రెండు దేశాలు పరస్పరం జారీ చేసిన వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌లను గుర్తించడాన్ని నిర్దారించడానికి వేగంగా చర్చలు జరుగుతున్నాయన్నారు. కాగా.. కొవిషీల్డ్ రెండు డోసులు వ్యాక్సిన్‌ తీసుకున్న కూడా సవరణతో సంబంధం లేకుండా యూకేలో 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని బ్రిటన్‌ అధికారులు స్పష్టం చేశారు.


Next Story