చైనాలో భారీ సంఖ్యలో నమోదవుతున్న కొత్త కేసులకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్-7 కారణం అని గుర్తించారు. ఇప్పుడు బీఎఫ్-7 వేరియంట్ భారత్ లోనూ వ్యాపిస్తోంది. బీఎఫ్-7 వేరియంట్ తో ఇప్పటిదాకా భారత్ లో మూడు కేసులు నమోదయ్యాయి. వీటిలో మొదటి కేసు అక్టోబరులోనే గుజరాత్ లో వెలుగు చూసింది. గుజరాత్ బయోటెక్నాలజీ సెంటర్ ఈ కేసును గుర్తించింది. మిగతా రెండు కేసుల్లో ఒకటి గుజరాత్ లోనే నమోదు కాగా, మరొకటి ఒడిశాలో బయటపడింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా కేసుల్లో పెరుగుదల ఏమీ లేదని, అయితే, కొత్త వేరియంట్లపై నిఘా ఉంచాలని నిర్దేశించారు.
కొవిడ్ ఇంకా పూర్తిగా అంతరించిపోలేదని, అధికారులు నిశితంగా పరిశీలిస్తుండాలని పేర్కొంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మనదేశంలో భయపడాల్సిన అవసరంలేదని తెలిపింది. ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ కు రీ ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం ఉందని కేంద్రం వెల్లడించింది. ఈ వేరియంట్ కు ఇంక్యుబేషన్ వ్యవధి కూడా చాలా తక్కువ అని.. ఏవైనా శాంపిల్స్ పాజిటివ్ వస్తే వాటికి తప్పనిసరిగా జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని రాష్ట్రాలకు సూచించింది. అమెరికా, బ్రిటన్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్ దేశాల్లోనూ బీఎఫ్-7 కేసులు ఉన్నట్టు గుర్తించారు.