దేశంలో కరోనా మహమ్మారి ప్రస్తుతం అదుపులోనే ఉంది. అయితే.. రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే నేడు 50 శాతానికి పైగా పెరిగాయి. ఈ విషయం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం ఢిల్లీలో 202 కేసులు నమోదు కాగా.. బుధవారం ఆ సంఖ్య 299 కి చేరింది. ఢిల్లీలో రోజువారి కరోనా పాజిటివిటీ రేటు 2.9 శాతానికి పెరిగింది. కాగా.. కేసుల పెరుగుదలపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.
పరిస్థితిని చాలా నిశితంగా గమనిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదన్నారు. కరోనా కేసుల సంఖ్య పెరిగితే నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలోని ఓ ప్రైవేటు పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలలో ఓ టీచర్‌తో పాటు ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మిగతా విద్యార్థులందరికి సెలవులు ప్రకటించారు.
ఇక దేశంలో కొత్తగా 1007 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,39,023కు చేరాయి. ఇందులో 4,25,06,228 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకోగా.. మరో 11,058 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 5,21,737 మంది మరణించారు.