ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన ఈడీ కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు మే 23 వరకు పొడిగించింది. ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో సిసోడియాను సోమవారం కోర్టులో హాజరుపరచగా.. 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించారు. ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయగా, మనీష్ సిసోడియా ప్రస్తుతం ఈడీతో పాటు సీబీఐ కేసులోనూ జ్యుడీషియల్ కస్టడీ కింద తీహార్ జైలులో ఉండడం గమనార్హం.
అంతకుముందు శనివారం (ఏప్రిల్ 6), ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నిందితులు రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రాలకు రోస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరికి రూ.2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు వారిద్దరికీ బెయిల్ మంజూరు చేసింది.
ఫిబ్రవరి 7న గౌతమ్ మల్హోత్రా, ఫిబ్రవరి 8న రాజేష్ జోషిని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో మీడియా పబ్లిసిటీ కంపెనీ యజమాని రాజేష్ జోషి, వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను నిందితులుగా.. ఈడీ కోర్టులో దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీట్‌లో పేర్కొంది. ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఈడీ మనీలాండరింగ్ కేసులో తొలిసారిగా నిందితులకు బెయిల్ లభించింది. రూ.2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌తో కూడిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.