ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా నలుగురిపై సీబీఐ మంగళవారం అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బుచ్చిబాబు, అర్జున్ పాండే, అమన్‌దీప్ ధాల్‌లపై రూస్ అవెన్యూ కోర్టులో సప్లీమెంటరీ ఛార్జిషీటు దాఖలైంది. మద్యం పాలసీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఈ కేసులో సిసోడియాను సిబిఐ ఫిబ్రవరి 26న అరెస్టు చేసింది. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిమనీలాండరింగ్ కేసులో సిసోడియాను ఈడీ కూడా విచారిస్తోంది. ఈ కేసులో అవినీతికి సిసోడియా ప్రధాన కుట్రదారు అని పేర్కొంది.
2021-22 నాటి ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ మద్యం వ్యాపారులకు లైసెన్స్‌లు మంజూరు చేయడానికి కొంతమంది డీలర్‌లకు అనుకూలంగా ఉందని ఆరోపించింది. సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్‌పై విచారణ చేపట్టేందుకు రూస్ అవెన్యూ కోర్టు మే 12న విచారణ చేపట్టనుంది. మరోవైపు సిసోడియా భార్య 'ఆటో ఇమ్యూన్ డిజార్డర్'తో బాధపడుతూ ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు మంగళవారం వార్తలు వచ్చాయి. నివేదికల ప్రకారం.. సీమా సిసోడియా పరిస్థితి మరింత దిగజారడంతో ఆసుపత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. సీమా సిసోడియాను ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. సిసోడియా భార్యను ఆమె నివాసంలో కలిశారు. సిసోడియా అరెస్టు నేపథ్యంలో సాధ్యమైన సహాయానికి హామీ ఇచ్చారు.