కుమారుడి మృతదేహం ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్‌.. బిచ్చ‌మెత్తుకున్న తండ్రి..వీడియో వైర‌ల్‌

Couple Begged for money to pay for release of son dead body in Bihar.అస‌లే కుమారుడు చ‌నిపోయి ఆ త‌ల్లిదండ్రులు పుట్టెడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Jun 2022 11:35 AM IST
కుమారుడి మృతదేహం ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్‌.. బిచ్చ‌మెత్తుకున్న తండ్రి..వీడియో వైర‌ల్‌

అస‌లే కుమారుడు చ‌నిపోయి ఆ త‌ల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. అలాంటి వారిపై క‌నిక‌రం చూపించాల్సింది పోయి అమానుషంగా ప్ర‌వ‌ర్తించారు ఆస్ప‌త్రి సిబ్బంది. కొడుకు మృత‌దేహాం కావాలంటే రూ.50 వేలు ఇస్తేనే గాని అప్ప‌గించ‌మ‌ని చెప్పారు. అంత సొమ్ము త‌మ వ‌ద్ద లేద‌ని ప్రాదేయ‌ప‌డినా వారు విన‌లేదు. దీంతో ఆ నిరుపేద తండ్రి న‌గ‌రంలోని వీధి వీధి తిరుగుతూ బిచ్చ‌మెత్తుకున్నాడు. ఈ ఘ‌ట‌న బిహార్ రాష్ట్రంలోని స‌మ‌స్తిపూర్‌లో చోటు చేసుకుంది.

'కొద్ది రోజుల క్రితం నా కుమారుడు క‌నిపించ‌కుండా పోయాడు. అత‌డు చ‌నిపోయాడ‌ని, స‌మ‌స్తిపూర్‌లోని స‌ర్దార్ ఆస్ప‌త్రిలో మృతదేహం ఉంద‌ని, వ‌చ్చి తీసుకువెళ్లాల‌ని ఇటీవ‌ల నాకు ఓ ఫోన్ కాల్ వ‌చ్చింది. తీరా ఆస్ప‌త్రికి వెళితే.. రూ.50వేలు ఇస్తేనే మృత‌దేహాన్ని అప్ప‌గిస్తామ‌న్నారు. మేం చాలా బీద‌వాళ్లం. అంత పెద్ద మొత్తం ఎక్క‌డి నుంచి తీసుకురావాలి.' అంటూ మృతుడి తండ్రి మ‌హేశ్ ఠాకూర్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీంతో ఆస్ప‌త్రి సిబ్బందిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. కాగా.. ఈ ఆస్ప‌త్రిలో ప‌నిచేస్తున్న వారిలో చాలా మంది కాంట్రాక్టు ఉద్యోగులేన‌ని, గ‌త కొద్ది రోజులుగా వారికి జీతాలు స‌రిగా ఇవ్వ‌క‌పోవ‌డంతో ఇలా రోగుల బంధువుల నుంచి డ‌బ్బులు డిమాండ్ చేసి తీసుకుంటున్న‌ట్లు స్థానిక మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి.

కాగా.. ఈ ఘ‌ట‌న‌పై ఆస్ప‌త్రి యాజ‌మాన్యం స్పందించింది. ఇది అవ‌మాన‌వీయ ఘ‌ట‌న అని, బాధ్యుల‌పై త‌ప్ప‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. దీనిపై ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు జిల్లా అద‌న‌పు మెజిస్ట్రేట్ విన‌య్ కుమార్ రాయ్ తెలిపారు.

Next Story