రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మొదట ఎంపీల ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఎంపీల ఓట్లు ముగిసిన తర్వాత.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము.. ప్రతిపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ప్రతిపక్షాల అభ్యర్ధి యశ్వంత్ సిన్హాపై బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) ద్రౌపది ముర్ము ఆధిక్యంలో ఉన్నారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ తెలిపారు.
ఎంపీల ఓట్లను లెక్కించిన తర్వాత ట్రెండ్స్ గురించి మోదీ విలేకరులకు వివరించారు. ముర్ము 540 ఓట్లు సాధించగా.. యశ్వంత్ సిన్హా 208 ఓట్లు సాధించారని చెప్పారు. 15 ఓట్లు చెల్లకుండా పోయాయని తెలిపారు. ఎంపీల మొత్తం ఓట్ల విలువ 5,23,600 గా పేర్కొన్నారు. ఇందులో ముర్ము 3,78,000 సొంతం చేసుకోగా.. యశ్వంత్ సిన్హా 1,45,600 పొందారని మోదీ పేర్కొన్నారు. ఇదిలావుంటే.. ద్రౌపది ముర్ము స్వస్థలమైన ఒడిశాలోని రాయిరంగపూర్ గ్రామంలో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు అనంతరం అధికారిక ప్రకటన వెలువడనుంది.