ఆందోళనకర కరోనా వేరియంట్.. థర్డ్‌వేవ్ పెద్ద ముప్పేం కాదు..!
Corona Third Wave. కరోనా వైరస్... గత కొని నెలలుగా ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తోంది.
By అంజి Published on 31 Aug 2021 3:07 AM GMTకరోనా వైరస్... గత కొని నెలలుగా ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తోంది. కొత్త కొత్త వేరియంట్లతో ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజు రోజుకు తన రూపాన్ని మార్చుకుంటూ వివిధ దేశాల్లో చాపకింద నీరులా విజృంభిస్తోంది. తాజాగా సౌతాఫ్రికా దేశంలో కొత్త వేరియంట్ వెలుగు చూసింది. c.1.2గా పిలుస్తోన్న ఈ కరోనా వేరియంట్ వైరస్ తొందరగా వ్యాప్తి చెందుతోంది. అయితే ఈ c.1.2 వేరియంట్‌ను కరోనా వ్యాక్సిన్‌ల ద్వారా అడ్డుకట్ట వేయొచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. c.1.2 వేరియంట్‌ను మొదటిసారిగా ఈ సంవత్సరం మే నెలలో గుర్తించారు. సౌతాఫ్రికాకు చెందిన క్వాజులు నాటల్ రీసెర్చ్ ఇన్నేవేషన్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికెబుల్ డీసీజెస్‌లు కలిసి c.1.2 కరోనా వేరియంట్‌ను గుర్తించినట్లు ప్రకటించాయి.
ఈ నెల 13 నాటికి స్విట్జర్లాంట్, న్యూజిలాండ్, పోర్చుగల్, ఇంగ్లాండ్, చైనా, మారిషన్, కాంగో దేశాల్లో c.1.2 కరోనా వేరియంట్ వ్యాపించినట్లు తెలిపాయి. అంతకుముందు సౌతాఫ్రికాలో విజృంభించిన c.1 కరోనా వేరియంట్ నుండే ఈ కొత్తరకం c.1.2 వేరియంట్ ఏర్పడినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇతర రకాల మ్యుటేషన్లతో పొలిస్తే ఈ వేరియంట్ దాదాపు రెట్టింపు వేగంతో మార్పులు చెందుతున్నట్లు పరిశోధకులు తెలిపారు. బీటా, డేల్టా వేరియంట్ల లాగానే c.1.2 వేరియంట్‌లో కూడా మ్యూటేషన్‌లు పెరుగుదల జరుగుతున్నట్లో తాజా అధ్యయనంలో తెలిసింది. ఈ c.1.2 వేరియంట్‌లో వ్యాక్సిన్ ద్వారా వచ్చే యాంటీబాడీలను తప్పించుకునే గుణం ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు.
థర్డ్‌వేవ్ పెద్ద ముప్పేం కాదు
ఇక భారత్‌లో కరోనా థర్డ్‌వేవ్ వచ్చినా దాని తీవ్రత స్వల్పంగానే ఉండనున్నట్లు తాజా అధ్యయనంలో తెలిసింది. వైరస్ తీవ్రతను భారత్‌లోని ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ముగ్గురు సభ్యుల బృందం ఎప్పటికప్పుడూ అంచనా వేస్తోంది. ఒక వేళ సెప్టెంబర్ నెలలో కరోనా కొత్త వేరియంట్ వెలుగు చూస్తే.. రోజువారీ కేసులు సమారుగా లక్ష వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఇది సేకండ్ వేవ్‌తో పోలిస్తే స్వల్పమేనని తెలిపింది. ఒక వేళ్ల కొత్త కరోనా రకం బయటపడకపోతే పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదని తాజా అధ్యయనంలో తెలిసింది.