ఢిల్లీలో ముగ్గురు విదేశీయులకు కరోనా పాజిటివ్
Corona positive for three foreigners in Delhi. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో ప్రపంచ దేశాలు అన్ని అలర్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే భారత్‌లో కూడా విదేశాల
By అంజి Published on 2 Dec 2021 3:28 PM ISTదక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో ప్రపంచ దేశాలు అన్ని అలర్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే భారత్‌లో కూడా విదేశాల నుండి వచ్చే ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లోనూ ప్రయాణికుల పరీక్షలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఒమిక్రాన్ వ్యాపించిన దేశాల నుండి వస్తున్న ప్రయాణికులపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించిన ప్రమాదకర దేశాలకు చెందిన మరో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఈ కరోనా బాధితులను ప్రస్తుతం లోక్ నారాయణ్ జయప్రకాశ్ ఆస్పత్రిలో చేర్చారు. వారి రక్త నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. కాగా విదేశాల నుండి వచ్చే ప్రతి ఒక్క ప్రయాణికుడు ఎయిర్‌పోర్టులో తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి.
ఇదిలా ఉంటే తెలంగాణలో బుధవారం నాడు యూకే నుండి హైదరాబాద్‌కు వచ్చిన ఓ 35 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. రాజీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మహిళకు ఎయిర్‌పోర్టులో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేశారు. అందులో ఆమె పాజిటివ్ వచ్చినట్లు నిర్దారణ అయ్యిందని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్‌రావు తెలిపారు. ఒమ్రికాన్ వేరియంట్‌కు సంబంధించి యూకే దేశం ఇప్పటికే ప్రమాదకర దేశంగా వర్గీకరించబడింది. ప్రయాణికురాలిని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేర్చారు.
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. నిన్న 10,98,611 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 9,765 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,46,06,541కి చేరింది. నిన్న ఒక్క రోజే 477 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,69,724కి చేరింది. నిన్న8,548 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,40,37,054కి చేరింది. ప్రస్తుతం దేశంలో 99,763 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.35 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.