కరోనా మహమ్మారి నుంచి రక్షించాలంటూ ఉత్తరప్రదేశ్ లోని శుక్లాపూర్ గ్రామ ప్రజలు కరోనా మాతను ఆలయాన్ని నిర్మించారు. గ్రామస్థులు చందాలు వేసుకుని ఈ ఆలయ నిర్మాణం చేశారు. ప్రజలు తండోపతండాలుగా వస్తూ ఉండడంతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ, భక్తులకు తీర్థప్రసాదాలు కూడా ఇస్తూ ఉన్నారు. ప్రాణాంతక కరోనా వైరస్ వేలాది మంది ప్రజలను పొట్టనబెట్టుకుంటోందని, అందుకే తాము కరోనా మాత ఆలయం నిర్మించామని గ్రామస్థులు చెప్పారు. ఈ మందిరంలో కరోనా అమ్మవారి విగ్రహం కూడా మాస్కు ధరించి ఉంటుంది. ఇక్కడికి శుక్లాపూర్ గ్రామస్థులే కాకుండా, పరిసర గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. ఇక్కడికి వచ్చేవారు తప్పకుండా మాస్కులు ధరించి రావాలని, భౌతికదూరం పాటించాలని స్థానికులు కోరుతున్నారు.
కరోనా మాతా ఆలయాన్ని లోకేష్ కుమార్ శ్రీవాస్తవ అనే వ్యక్తి నిర్మించారు. నిర్మించిన తర్వాత నోయిడాకు తిరిగి వెళ్లారు. తన భూమిని ఆక్రమించేందుకు తనకు చెందిన స్థలంలో కరోనా మాతా గుడి కట్టినట్లు నగేశ్ కుమార్ శ్రీవాస్తవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం రాత్రి కరోనా మాతా గుడిని కొందరు కూల్చివేశారు. పోలీసులే దీనిని కూల్చినట్లుగా స్థానికులు ఆరోపించగా.. తాము చేయలేదని పోలీసులు తెలిపారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.