వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నా ఎంత మందికి కరోనా వచ్చిందంటే..?
Corona After Two Doses of Vaccine. కరోనా మహమ్మారిని అడ్డుకోడానికి వ్యాక్సిన్ ఒక్కటే ఆయుధమని వైద్య నిపుణులు చెబుతూ
By Medi Samrat Published on 19 Aug 2021 6:41 PM ISTకరోనా మహమ్మారిని అడ్డుకోడానికి వ్యాక్సిన్ ఒక్కటే ఆయుధమని వైద్య నిపుణులు చెబుతూ ఉన్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా కూడా కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న బ్రేక్ త్రూ కేసులు 87 వేల దాకా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కేరళలోనే దాదాపు 46 శాతం మంది దాకా ఉన్నారు. కేరళలో మొదటి డోసు తీసుకున్న 80 వేల మందికి కరోనా సోకగా.. రెండు డోసులు తీసుకున్న 40 వేల మంది దాని బారిన పడ్డారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజువారీ కేసుల్లో కేరళలోనే అత్యధికంగా వస్తున్నాయి. బ్రేక్ త్రూ కేసులూ ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా నమోదవుతుండడం పట్ల కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేరళ రాష్ట్రానికి చెందిన 200 బ్రేక్ త్రూ కేసుల శాంపిళ్లను జన్యుక్రమ విశ్లేషణ కోసం పంపించారు. ఆ శాంపిళ్లలో ఎలాంటి జన్యుపరివర్తన జరిగిన కరోనా మూలాలు లేవని తేల్చారు. కేరళలో బ్రేక్ త్రూ కేసులు పెరిగిపోతుండడంతో దాని పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులపైనా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.
దేశంలో గత 24 గంటల్లో 36,401 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.భారతదేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,23,22,258కు చేరింది. అలాగే నిన్న కరోనా నుంచి 39,157 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 530 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,33,049కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,15,25,080 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 149 రోజుల కనిష్ఠస్థాయికి చేరుకుంది. 3,64,129 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశంలో నిన్న 56,36,336 వ్యాక్సిన్ డోసులు వేశారు.