కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకుని రావాలని ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే..! 'భారత్ జోడో యాత్ర'లో ఉన్నారు రాహుల్ గాంధీ. ఆయన శుక్రవారం నాడు తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో వివాదాస్పద క్యాథలిక్ ప్రీస్ట్ జార్జ్ పొన్నయ్యను కలవడం హాట్ టాపిక్ గా మారింది. పాస్టర్‌తో రాహుల్ గాంధీ సంభాషించిన వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. అందులో రాహుల్ గాంధీ "యేసుక్రీస్తు దేవుని రూపమా? అది సరియైనదేనా?" పాస్టర్ జార్జ్ పొన్నయ్య "యేసే నిజమైన దేవుడు" అని బదులిచ్చారు. రాహుల్ గాంధీ పాస్టర్ల బృందాన్ని యేసు దేవుడా..? దేవుని రూపమా..? అని అడిగారు. దానికి పాస్టర్ జార్జ్ పొన్నయ్య స్పందిస్తూ.. యేసు మాత్రమే దేవుడని, హిందూ దేవుళ్లలా కాదని అన్నారు. "యేసు క్రీస్తు దేవుడు.. నిజమైన దేవుడు. శక్తి, ఇతర హిందూ దేవుళ్లలా కాదు" అని జార్జ్ పొన్నయ్య చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
జార్జ్ పొన్నయ్యను రాహుల్ గాంధీ కలవడంపై బీజేపీ అధికార ప్రతినిధి హెషజాద్ పునావాలా ట్విట్టర్ లో విమర్శలు చేశారు. 2021లో జార్జ్ పొన్నయ్య ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, డీఎంకే నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు కూడా చేశారు పొన్నయ్య. భారత మాత మలినాలు మమ్మల్ని కలుషితం చేయకూడదు కాబట్టి నేను బూట్లు ధరిస్తానని అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాస్టర్ జార్జ్ పొన్నయ్యను కలవడంపై రాహుల్ గాంధీని తప్పుబడుతున్నారు.