కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ ఢిల్లీలో భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న నేపథ్యంలో భద్రతా వైఫల్యాలపై చర్చ జరుగుతోంది. ఈ సమయంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తన జీవితానికి సంబంధించి బీజేపీ రోడ్ మ్యాప్ చూపిస్తుందని.. ఎప్పటికీ చేయకూడనివి ఏమిటో నేర్పుతోందని రాహుల్ గాంధీ అన్నారు. అందుకే ఈ విషయంలో బీజేపీ తనకు గురువు అని చెప్పారు. భారత్ జోడో యాత్రను కన్యాకుమారిలో ప్రారంభించే సమయంలో దీన్ని తాను కేవలం ఒక యాత్రగా మాత్రమే చూశానని.. అయితే ఇప్పుడు ఈ యాత్ర ఒక గొంతుకను, ప్రజల భావాలను కలిగి ఉందని చెప్పారు. భారత్ జోడో యాత్రలో ప్రతి ఒక్కరికి తలుపులు తెరిచే ఉంటాయని, తమతో చేరకుండా తాము ఎవరినీ ఆపబోమని అన్నారు.
తాను బుల్లెట్ ప్రూఫ్ కారులో తిరుగుతూ భారత్ జోడో యాత్రలో పాల్గొనాలా? అని ప్రశ్నించారు. అది ఎలా సాధ్యమని రాహుల్ ప్రశ్నించారు. వ్యక్తులను, పార్టీలను బట్టి ప్రోటోకాల్స్ మారుతాయా అని నిలదీశారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు. భారత్ జోడో యాత్ర దేశ భావోద్వేగాలకు సంబంధించిందని, తనకు చాలా విషయాలు నేర్పిందని రాహుల్ అన్నారు. తాను ఊహించిన దానికంటే ఎక్కువే నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. 2024లో ప్రతిపక్షాలు అన్నీ ఏకమైతే బీజేపీ గెలవడం కష్టం అన్నారు.