ఆర్థిక అవకతవకలకు పాల్పడి జైలు శిక్ష అనుభవిస్తున్న సుకేశ్ చంద్రశేఖర్ పేరు దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. అతడి రిచ్ లైఫ్, కాంటాక్స్ట్.. బాలీవుడ్ నటీమణులతో ఉన్న పరిచయాలు.. ఇలా ఎన్నో విషయాలు అందరినీ ఆకర్షించాయి. ఇక ఇటీవలి కాలంలో అతడు చేస్తున్న వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక సుకేశ్ ఏ క్షణాన అయినా బీజేపీలో చేరతారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు జైలు నుంచే లేఖలు రాస్తూ అరవింద్ కేజ్రీవాల్‌పై సుకేశ్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆప్ నేతలు తనను బెదిరిస్తున్నారని, తనను, తన భార్యను ఢిల్లీ నుంచి వేరే జైలుకు మార్చాలని ఆ లేఖల్లో కోరుతున్నాడు.
కేజ్రీవాల్ స్పందిస్తూ.. సుకేశ్ ఎప్పుడైనా బీజేపీలో చేరొచ్చని.. అతడు బీజేపీ భాషను నేర్చుకుంటున్నారని విమర్శించారు. సుకేశ్ బీజేపీలో చేరేందుకు శిక్షణ పొందుతున్నారని.. ఇప్పుడో, అప్పుడో బీజేపీలో చేరడం పక్కా అని కేజ్రీవాల్ అన్నారు. అతడిని బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా చేయాలి. అప్పుడైనా ర్యాలీల్లో ప్రజలు చూసి, ఆయన చెప్పే కథలు వింటారని కౌంటర్లు వేశారు. కనీసం అలాగైనా బీజేపీ ర్యాలీలకు జనం వస్తారు. సుకేశ్‌ను వెంటనే పార్టీలో చేర్చుకుని పార్టీ చీఫ్‌ను చేయాలని కేజ్రీవాల్ విమర్శించారు.