ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్ ఓ భక్తుడి బూట్లను తుడిచారు. ఉదంసింగ్ నగర్‌లోని నానక్‌మిట్టలో గల గురుద్వారాను ఆయన సందర్శించారు. అనంతరం అక్కడి ఓ భక్తుడి బూట్లను శుభ్రం చేశారు. అనంతరం ఆలయ పరిసరాలను చీపురుతో శుభ్రం చేశారు.
ఇంతకీ ఏం జరిగింది?
ఇటీవల హరీష్ రావత్ పంజాబ్ రాష్ట్ంరలో పర్యటించారు. అక్కడ నవజోత్ సింగ్ సిద్ధూ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిక్కుల పవిత్రమైన ఓ పదాన్ని ఉపయోగించడంతో రావత్ చేసిన ఆ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సిద్ధూతో సహా మరో నలుగురు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లను సిక్కుల పవిత్ర పదంతో హరీష్ రావత్ పోల్చారు.
దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయంటూ సిక్కుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయమై స్పందించిన హరీష్ రావత్.. సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. సిక్కుల సంప్రదాయం పట్ల తనకు గౌరవం ఉందని, ఆ పవిత్ర పదాన్ని ఉపయోగించి తప్పు చేశానన్నారు. అలాగే తాను చేసిన పాపానికి ప్రాయశ్చితంగా గురుద్వారాలో కరసేవ చేస్తానని తెలిపారు. ఇందులో భాగంగానే మాజీ సీఎం హరీష్ రావత.. ఉత్తరాఖండ్‌లోని ఓ గురుద్వారాలో కరసేవ చేశారు.