కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో ఇంధన ధరల పెంపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరస చేపట్టారు. దీంతో రోడ్డుపై 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. అదే సమయంలో ట్రాఫిక్‌లో నటుడు జోజు జార్జ్ చిక్కుకుపోయారు. దాదాపు రెండు గంటల పాటు కారులోనే ఉన్న జోజు.. సహనం కోల్పోయి కారు దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. సాధారణ వ్యక్తులకు కష్టాలు తెచ్చే విధంగా నిరసన చేపట్టడం సరికాదని కార్యకర్తలతో చెప్పారు. దీంతో కోపం తెచ్చుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు నటుడు జోజు కారు అద్దాలను పగలగొట్టారు.
ఈ ఘటనపై నటుడు జోజు మీడియాతో మాట్లాడారు. ఇంధన ధరల పెంపుతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారని, దీనిపై నిరసన తెలపాలని, అయితే అది ఈ విధంగా మాత్రం కాదని అన్నారు. రోడ్లపై నిరసన తెలపడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, హాస్పిటల్‌కు వెళ్లాల్సిన వారు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారని అన్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం మరోలా ఆరోపిస్తోంది. మహిళ కార్యకర్తలతో నటుడు జోజు మద్యం సేవించి దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించింది. జోజుపై కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకరన్ మండి పడ్డారు. మద్యం సేవించి రౌడీలా ప్రవర్తించాడంటూ, ఆయనపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ వివాదం అనంతరం నటుడు జోజు స్థానిక ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. అయితే పరీక్షల్లో మద్యం తీసుకోలేదని తేలింది. తాను వివాదాన్ని కోరుకోవడం లేదని నటుడు జోజు అన్నారు. ఇంతటితో ఈ వ్యవహారాన్ని ముగించాలని విజ్ఞప్తి చేశారు. సామాన్య పౌరులకు ఇబ్బందులు కలిగేలా నిరసన తెలపడం మాత్రం సరికాదని జోజు అన్నారు.