మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు పలికిన కాంగ్రెస్

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది.

By Medi Samrat  Published on  20 Sept 2023 4:00 PM IST
మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు పలికిన కాంగ్రెస్

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. మహిళా రిజర్వేషన్ బిల్లు రాజీవ్ గాంధీ కల అని, ఆ బిల్లు ఆమోదం పొందితే ఆయన కల నెరవేరినట్లేనని కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ అన్నారు. లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన సోనియా.. నారీ శక్తి వందన్‌ అభియాన్‌ 2023 బిల్లుకు కాంగ్రెస్ మద్దతిస్తుందని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును మొదట ప్రవేశ పెట్టింది కాంగ్రెస్ అయినా.. అప్పట్లో ఈ బిల్లును అడ్డుకున్నారని అన్నారు. ఇప్పటికైనా బిల్లు చర్చకు రావడంతో సంతోషంగా ఉందన్నారు. నారీ శక్తి బిల్లును వెంటనే అమల్లోకి తేవాలన్నారు. తక్షణమే కుల జనగణన చేపట్టాలన్నారు. త్వరగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళల జాబితా తయారు చేయాలన్నారు. ఇక స్థానిక సంస్థల్లో మహిళలకు రాజీవ్ గాంధీ రిజర్వేషన్ కల్పించారని డిమాండ్ చేశారు సోనియా గాంధీ.

భారత నారీ శక్తి ఎంతో ఘనమైనదని కొనియాడారు. స్త్రీ శక్తిని కొలవడం అసాధ్యమని అన్నారు. వంటింటి నుంచి ప్రపంచ వేదికల వరకు భారత మహిళల పాత్ర ఎంతో ఉందన్నారు. మహిళలు వారి స్వార్థం గురించి ఏనాడు ఆలోచించరన్నారు. స్త్రీల త్యాగాలు ఎనలేనివని, ఆధునిక భారత నిర్మాణంలో పురుషులతో కలిసి మహిళలు పోరాడారని, స్వతంత్ర్య సంగ్రామంలో కూడా వారి పాత్ర అనిర్వచనీయమని కొనియాడారు సోనియా గాంధీ.

Next Story