పంజాబ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 86 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. రాష్ట్ర సీఎం చరణ్‌జిత్ సింగ్ చున్నీ చమ్‌కౌర్ సాహిబ్ నుంచి బరిలో ఉండగా.. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ అమృత్‌సర్ ఈస్ట్ నుంచి అసెంబ్లీ బరిలో నిలవనున్నారు. డేరా బాబా.. నానక్ స్థానం నుంచి రాష్ట్ర డిప్యూటీ సీఎం సుఖ్‌జీందర్ సింగ్ రంధావాను కాంగ్రెస్ బరిలోకి దింపింది. మరోవైపు ఇటీవల కాంగ్రెస్ మట్టికరిచిన మోగా స్థానం నుంచి మాళవికా సూద్ పోటీ చేయనున్నారు.
మాళవిక సూద్ బాలీవుడ్ నటుడు సోనూసూద్ సోదరి. పంజాబ్‌లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 117 స్థానాలకు ఫిబ్రవరి 14న పోలింగ్ జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈసారి సువిధ యాప్ ద్వారా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నామినేషన్లు దాఖలు చేసేందుకు కూడా అనుమతించారు. రాష్ట్రంలో సీఎం చన్నీ, సిద్ధూ మధ్య టగ్ ఆఫ్ వార్ కూడా నడుస్తోందని వార్తలు వస్తున్నాయి. తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని సిద్ధూ కోరుతుండగా.. చన్నీకి కూడా మరో అవకాశం కల్పించే దిశగా కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.