బైక్‌ మెకానిక్గా మారిన రాహుల్ గాంధీ.. ఫొటోలు వైరల్

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కాసేపు తన బిజీ షెడ్యూల్‌ను పక్కన పెట్టి.. బైక్‌ మెకానిక్‌గా మారారు.

By అంజి  Published on  28 Jun 2023 10:24 AM IST
Congress, Rahul Gandhi, motorcycle mechanics, Karol Bagh, Delhi

బైక్‌ మెకానిక్గా మారిన రాహుల్ గాంధీ.. ఫొటోలు వైరల్

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కాసేపు తన బిజీ షెడ్యూల్‌ను పక్కన పెట్టి.. బైక్‌ మెకానిక్‌గా మారారు. మంగళవారం నాడు దేశ రాజధాని ఢిల్లీలోని కరోల్‌ బాగ్‌ మార్కెట్‌లో రాహుల్‌ ఆకస్మిక పర్యటన చేశారు. అక్కడ ఉన్న బైక్‌ రిపేర్‌ షాపుకు వెళ్లి మెకానిక్‌ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. బైక్‌ రిపేర్‌ షాప్కు వెళ్లి రాహుల్‌ అక్కడి కార్మికుల కలిసి ముచ్చటించారు. వాళ్లతో కలిసి బైక్‌ రిపేర్‌ చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పనిలో పనిగా తానూ కూడా బైక్‌ రిపేర్‌ చేయడంలో మెలుకువలు తెలుసుకుని వారికి సాయం చేశారు.

ఓ స్క్రూడ్రైవర్‌ను అందుకుని బైక్ నట్లను బిగించారు. బైక్‌ ఇంజిన్ పనితీరు గురించీ రాహుల గాంధీ.. అక్కడి వర్కర్లను అడిగి తెలుసుకున్నారు. కరోల్‌బాగ్‌కు రాహుల్‌ రాకతో ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. వారందరికీ రాహుల్‌ షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు. ఆ తర్వాత పక్కనే ఉన్న లేథ్‌ మెషిన్‌ షాప్‌లోకి వెళ్లి అక్కడ తయారయ్య పరికరాలపై ఆరా తీశారు. దాదాపు 2 గంటల పాటు ఆయన అక్కడే ఉన్నారు. వీటికి సంబంధించిన ఫొటోలను రాహుల్ గాంధీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

రెంచీలను తిప్పుతూ మన దేశ చక్రాలు ముందుకు సాగేలా చేస్తున్న వారి నుంచి ఎంతో నేర్చుకున్నానని రాహుల్ పేర్కొన్నారు. ఈ కార్మికుల చేతులే భారత్‌ను నిర్మిస్తాయని రాహుల్ వ్యాఖ్యానించారు. వారి బట్టలకు అంటుకున్న గ్రీసు మన దేశ గౌరవం, ఆత్మాభిమానమని, ప్రజల నాయకుడు మాత్రమే వారిని ప్రోత్సహిస్తాడని అన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ద్వారా స్పందించింది. భారత్ జోడో యాత్ర కొనసాగుతూనే ఉందని వ్యాఖ్యానించింది. రాహుల్ నేరుగా పలు వర్గాల ప్రజల దగ్గరికి వెళ్లి.. వాళ్ల సమస్యలు, ఇబ్బందులు అడిగి తెలుసుకుంటున్నారు. ఇటీవల హరియాణాలోని అంబాలా నుంచి చంఢీగఢ్ వరకు లారీలో ప్రయాణించి లారీ డ్రైవర్ల సమస్యలను తెలుసుకున్నారు.

Next Story