కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ దేశం మొత్తాన్ని చుట్టేసేలా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. భారత్ జోడో యాత్ర పేరిట కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా సాగే ఈ యాత్ర నేడు ప్రారంభం కానుంది. దేశంలోని మెజారిటీ రాష్ట్రాల మీదుగా ఈ యాత్ర సాగేలా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రచించింది. భారత్ జోడో యాత్రను ప్రారంభించేందుకు రాహుల్ గాంధీ తమిళనాడులోని కన్యాకుమారికి చేరారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాహుల్ గాంధీ 3,500 కీలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయనున్నారు. 3,570 కిలోమీటర్ల దూరాన్ని ఆయన 150 రోజులలో నడవనున్నారు.
రాత్రిపూట రాహుల్ గాంధీ కంటేనర్లలో నిద్రించనున్నారు. జర్నీ మొత్తంలో రాహుల్ ఎక్కడా ఎటువంటి హోటల్‌లో బస చేయబోరని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. చాలా సింపుల్‌గా కంటేనర్లలో రాహుల్ నిద్రిస్తారని చెబుతున్నారు. రాహుల్ కోసం ప్రత్యేక కంటేనర్లను నిర్మిస్తున్నారు. ఆయన నిద్రపోయేందుకు బెడ్స్, టాయిలెట్లు, ఎసీలను ఏర్పాటు చేశారు. అధిక ఉష్ణోగ్రతలు, తేమను దృష్టిలో పెట్టుకుని దానికి తగినట్లు కంటేనర్లను డిజైన్ చేశారు. దాదాపు 60 కంటేనర్లను తయారు చేశారు. అవన్నీ ప్రస్తుతం కన్యాకుమారి చేరుకున్నాయి. రాత్రి పూట బస కోసం ప్రతి రోజు కొత్త ప్రదేశంలో ఆ కంటేనర్లను ఉంచనున్నారు.