కపిల్ సిబల్, భూపీందర్ సింగ్ హుడా, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ సహా G-23 నేతలు మరికొందరు తమ భవిష్యత్ కార్యాచరణను చర్చించేందుకు ఢిల్లీలోని గులాం నబీ ఆజాద్ నివాసానికి చేరుకున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సోనియా గాంధీ నాయకత్వాన్ని ఆమోదించిన తర్వాత మొదటిసారిగా 'అసమ్మతివాదులు' సమావేశమవుతున్నారు. G-23.. కాంగ్రెస్ సీనియర్ నాయకుల సమూహం. వారు పార్టీలో అంతర్గత సంస్కరణలు, సమిష్టి నాయకత్వాన్ని డిమాండ్ చేస్తూ 2020 ఆగస్టులో సోనియా గాంధీకి లేఖ రాశారు. గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, కపిల్ సిబల్, ఇతర నాయకులు G-23లో భాగం.
ఇదిలావుండగా.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ఈరోజు G-23 నాయకులపై స్పందించారు. G-23 నాయకులు బుధవారం కపిల్ సిబల్ నివాసంలో విందులో భాగంగా సమావేశమవుతారని.. సిడబ్ల్యుసి సోనియా గాంధీ నాయకత్వాన్ని ఆమోదించిన తర్వాత.. వారు తమ తదుపరి వ్యూహాన్ని రూపొందించాలని భావిస్తున్నారని అన్నారు. జి-23 నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ఖర్గే.. 'అసమ్మతివాదులు' పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు భిన్నంగా వీరు గులాం నబీ ఆజాద్ నివాసంలో భేటీ అయ్యారు.
ఇదిలావుంటే.. ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయిన తరువాత.. G-23 నాయకులు మార్చి 11న గులాం నబీ ఆజాద్ ఢిల్లీ నివాసంలో సమావేశమై పార్టీ పరాజయం గురించి చర్చించారు.