సీఎం త‌మ్ముడికి టికెట్ నిరాక‌రించిన కాంగ్రెస్ అధిస్టానం.. స్వతంత్ర అభ్యర్థిగా బ‌రిలోకి..

Congress denies ticket to Channi's brother who now is independent candidate. పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ సోదరుడు

By Medi Samrat  Published on  16 Jan 2022 1:22 PM GMT
సీఎం త‌మ్ముడికి టికెట్ నిరాక‌రించిన కాంగ్రెస్ అధిస్టానం.. స్వతంత్ర అభ్యర్థిగా బ‌రిలోకి..

పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ సోదరుడు మనోహర్‌ సింగ్ కు కాంగ్రెస్ అధిస్టానం టికెట్ నిరాక‌రించింది. బస్సీ పఠానా అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశించి భంగ‌ప‌డిన ఆయ‌న‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్ర‌క‌టించారు. ఆ స్థానం నుంచి ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ సింగ్ ను పార్టీ బరిలోకి దింపింది. పార్టీ నిర్ణయాన్ని 'అన్యాయం'గా అభివర్ణించిన మనోహర్‌సింగ్ చన్నీ.. నియోజకవర్గ ప్రజలకు కూడా అన్యాయం చేశారన్నారు. బస్సి పఠానా ప్రాంతంలోని పలువురు ప్రముఖులు స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండాల‌ని నన్ను కోరారు. వారు చెప్పిన దాని ప్రకారం నేను ముందుకు వెళ్తాను. వెనక్కి వెళ్లే అవకాశం లేదు.. నేను తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తాను' అని మనోహర్ సింగ్ తెలిపారు. తన సోదరుడితో మాట్లాడి తన నిర్ణయాన్ని ఒప్పిస్తానని మనోహర్ చెప్పాడు.

ఒక కుటుంబం ఒకే టిక్కెట్ ఫార్ములా ప్రకారం.. అతడిని రంగంలోకి దింపకూడదనే స‌రైన‌ నిర్ణయం కాదని అన్నారు. ఫిలింనగర్ స్థానం నుంచి జలంధర్ ఎంపీ సంతోక్ సింగ్ చౌదరి కుమారుడు విక్రమ్‌జిత్ సింగ్ చౌదరిని పార్టీ పోటీకి దింపిందని.. ఫతేఘర్ సాహిబ్ ఎంపీ అమర్ సింగ్ తనయుడు కమిల్ అమర్ సింగ్‌కు రాయకోట్ స్థానం నుంచి టికెట్ ఇచ్చినట్లు రెండు సంద‌ర్భాల‌ను మనోహర్‌సింగ్ చన్నీ ఉద‌హ‌రించారు. ఇదిలావుంటే.. పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్‌ శనివారం విడుదల చేసింది. చమ్‌కౌర్ సాహిబ్ నుంచి ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ పోటీ చేయనున్నారు.

ప్రభుత్వంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ మనోహర్ సింగ్.. కుటుంబం నుండి ఎటువంటి ఒత్తిడి లేదని, కేవలం ప్రజల డిమాండ్ మేరకే తాను నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గతేడాది ప్రభుత్వ ఉద్యోగానికి ఆయ‌న‌ రాజీనామా చేశారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయడంతో రాజకీయాల్లోకి అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యారు. మనోహర్ అనస్థీషియాలో పోస్ట్ గ్రాడ్యుయేట్. కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుండి జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీని కూడా పొందారు. చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్ర పట్టా కూడా పొందారు. అతను పంజాబ్ సివిల్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్‌కు ఉపాధ్యక్షుడుగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.


Next Story