క‌ర్ణాట‌క ప్ర‌జ‌ల‌కు ధన్యవాదాలు చెప్పిన కాంగ్రెస్‌.. బీజేపీ నేత‌లు మాత్రం..

Congress Claim to form government.. Attacks on BJP. క‌ర్ణాట‌క‌ ఎన్నికల ఫలితాలకు ముందు కాంగ్రెస్ కీలక ప్రకటన చేసింది.

By Medi Samrat  Published on  12 May 2023 10:03 AM GMT
క‌ర్ణాట‌క ప్ర‌జ‌ల‌కు ధన్యవాదాలు చెప్పిన కాంగ్రెస్‌.. బీజేపీ నేత‌లు మాత్రం..

క‌ర్ణాట‌క‌ ఎన్నికల ఫలితాలకు ముందు కాంగ్రెస్ కీలక ప్రకటన చేసింది. ఆ పార్టీ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా మాట్లాడుతూ.. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్‌ పార్టీదే విజయమని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన కర్ణాటకలోని 6.5 కోట్ల మంది ప్రజలకు సూర్జేవాలా కృతజ్ఞతలు తెలియజేశారు. రేపటి వరకు.. ఫలితాలు వచ్చే వరకు వేచి చూద్దాం. బీజేపీ ఓటమిని అంగీకరించిందని సూర్జేవాలా అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కర్ణాటక ప్రజలకు సేవ చేస్తుంద‌న్నారు.

మరోవైపు ఎన్నికల ఫలితాలకు ముందు క‌ర్ణాట‌క‌లో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, బీజేపీలు తమదైన వ్యూహాలు రచిస్తున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ఇతర బీజేపీ నాయకులు బెంగళూరులోని మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప నివాసంలో ముఖ్యసమావేశం నిర్వహించారు.

మరోవైపు ఫ‌లితాల‌ తర్వాత ఎవరికి మద్దతివ్వాలనేది తమ పార్టీ ముందే నిర్ణయించుకుందని మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. ఏ జాతీయ పార్టీతోనైనా పొత్తుకు జేడీఎస్ సిద్ధంగా ఉందని, అయితే ఒక షరతు ఉంటుందని.. నన్ను రాష్ట్రానికి సీఎంను చేయాలని, తమ పార్టీ నేతలకు మంత్రి ప‌ద‌వులు ఇవ్వాల‌ని అన్నారు.

ఈ నేప‌థ్యంలో కర్నాటక కింగ్‌ ఎవరనేది తెలియాలంటే.. రేప‌టి వ‌ర‌కూ సమాధానం కోసం వేచివుండాల్సిందే. రాష్ట్ర ప్రజలు ఏ పార్టీపై విశ్వాసం వ్యక్తం చేశారో ఓట్ల లెక్కింపు తర్వాతే తేలనుంది. బీజేపీ, కాంగ్రెస్ లు త‌మ త‌మ విజ‌యాల‌ను ప్ర‌క‌టించుకోగా.. జేడీఎస్ మాత్రం మైండ్ గేమ్ ఆడుతుంది.


Next Story