ముస్లింలు, మటన్, మంగళసూత్రాల గురించి మోదీ ఎందుకు మాట్లాడుతున్నారంటే: ఖర్గే
ప్రధాని మోదీకి 'ఎం' అనే అక్షరంతో మొదలయ్యే పదాలంటే చాలా ఇష్టమని, అందుకే ఆయన ముస్లింలు, మటన్, మంగళసూత్రాల గురించి మాట్లాడుతున్నారని ఖర్గే అన్నారు.
By అంజి Published on 16 May 2024 3:12 PM ISTముస్లింలు, మటన్, మంగళసూత్రాల గురించి మోదీ ఎందుకు మాట్లాడుతున్నారంటే: ఖర్గే
ప్రధాని మోదీకి 'ఎం' అనే అక్షరంతో మొదలయ్యే పదాలంటే చాలా ఇష్టమని, అందుకే ఆయన ముస్లింలు, మటన్, మంగళసూత్రాల గురించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. మోదీ ప్రభత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్నారని, తాము మద్ధతు ఇస్తున్నామని తెలిపారు. ఇండియా కూటమి కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. తమ కూటమికి ఎక్కువ సీట్లు రాబోతున్నాయని, మోదీ ప్రభుత్వాన్ని నిలువరిస్తామన్నారు. 400 సీట్లు గెలుస్తామన్న బీజేపీ వాదనలపై ఖర్గే స్పందించారు. ఇప్పటికే 400 సీట్లు వస్తాయంటూ నినాదం ఇస్తున్నారని, 600 దాటుతాయని చెప్పకపోవడం మన అదృష్టం అని ఖర్గే అన్నారు.
నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రైతుల సమస్యలు, పేదల ఆదాయం తగ్గిపోవడం వంటి విషయాలపై ప్రజల్లో ఆగ్రహం ఉందని, బీజేపీ ఓటమికి ఇదే కారణమవుతుందని అన్నారు. ఈ కారణాల వల్ల ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీజేపీని తిరస్కరించి, తమ కూటమి మద్దతు ఇస్తున్నారని ఖర్గే అన్నారు. ఈ ఎన్నికల్లో తాము గెలుస్తున్నామని ఆయన చెప్పారు. మోదీ తన హయాంలో అభివృద్ధి జరిగిందని కానీ, తాను ఈ పనులు చేశానని కానీ ఓట్లు అడగడం లేదన్న ఖర్గే.. వ్యక్తిగత విమర్శలు మాత్రమే చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి గురించి చెబుతూ ఓట్లు అడుగుతుంటే, బీజేపీ మాత్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఖర్గే అన్నారు.
ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఉపయోగిస్తున్న భాషపై ఖర్గే మాట్లాడారు. ప్రధానికి ఎం అనే పదం అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన నోటి నుంచి ముస్లిం, మటన్, మంగళ సూత్రం అనే మాటలు వస్తుంటాయని అన్నారు. కాంగ్రెస్ దళితుల, బీసీల రిజర్వేషన్లను దొంగిలించి ముస్లింలకు ఇస్తుందని ఎన్నికల ప్రసంగాల్లో మోదీ నిత్యం చెబుతున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంగళసూత్రం కూడా లాక్కుంటారని మోదీ అంటున్నారని ఖర్గే అన్నారు. విశ్వగురువుగా మారుతున్నారని చెబుతున్న ప్రధాని మటన్, చికెన్, మంగళసూత్రాల గురించి మాట్లాడితే విశ్వగురువు అవుతారా? అని ఖర్గే ప్రశ్నించారు.