భారతదేశం, పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ అధికారికంగా ప్రకటించారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటల నుంచి భూమి, గగనతలం, సముద్ర మార్గాల్లో అన్ని రకాల కాల్పులు, సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని ఇరు దేశాలు అంగీకరించినట్లు విక్రమ్ మిస్త్రీ వెల్లడించారు. ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారులు మే12వ తేదీన మరోసారి చర్చలు జరపనున్నారని తెలిపారు.
భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈ మొత్తం ఉదంతాన్ని పార్లమెంటుకు వివరించాలని ప్రభుత్వాన్ని కోరింది. కాల్పుల విరమణపై కాంగ్రెస్ పార్టీ నేత జైరామ్ రమేశ్ స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని, రాజకీయ పార్టీలను ఆహ్వానించాలని సూచించారు. పర్యాటకులపై ఉగ్రదాడి, తదనంతర ఉద్రిక్త పరిణామాలపై చర్చించడానికి, పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరచాలని కోరారు.