రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: ప్రధాని మోదీ

చెరకు రైతులకు మిల్లులు చెల్లించాల్సిన కనీస ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ అన్నారు.

By అంజి  Published on  22 Feb 2024 5:47 AM GMT
farmers, welfare, PM Modi, sugarcane price hike, National news

రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: ప్రధాని మోదీ

చెరకు రైతులకు మిల్లులు చెల్లించాల్సిన కనీస ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అన్నారు. చెరకు పంటకు గిట్టుబాటు ధరను పెంచిన నేపథ్యంలో గురువారం ఆయన ఎక్స్‌(ట్విటర్) వేదికగా స్పందించారు. "దేశవ్యాప్తంగా ఉన్న మా రైతు సోదర సోదరీమణుల సంక్షేమానికి సంబంధించిన ప్రతి తీర్మానాన్ని నెరవేర్చడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ సందర్భంలోనే చెరకు కొనుగోలు ధరలో చారిత్రాత్మక పెరుగుదల ఆమోదించబడింది. ఈ చర్య వల్ల మన చెరకు ఉత్పత్తి చేసే కోట్లాది మంది రైతులకి ప్రయోజనం చేకూరుతుంది'' అని ప్రధాని మోదీ అన్నారు.

బుధవారం రాత్రి ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ సమావేశమైంది. కేబినెట్‌ సమావేశం అనంతరం చెరకు గిట్టుబాటు ధరను పెంచినట్టు ప్రకటన చేసింది. గతంతో పోలిస్తే క్వింటాల్‌కు రూ.25 పెంచింది. దీంతో మద్దతు ధర రూ.340కు చేరింది. 2023-24తో పోలిస్తే ఇది 8 శాతం అధికం. ఈ సవరించిన ధర 2024 అక్టోబరు 1 నుంచి అమల్లోకి వస్తుంది. మరోవైపు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు చట్టబద్ధత కల్పించడం సహా పలు డిమాండ్లతో 'ఢిల్లీ చలో' ఆందోళనను తలపెట్టిన అన్నదాతలు ఈ నెల 13 నుంచి పంజాబ్‌-హర్యానా రాష్ట్రాల సరిహద్దుల్లోని శంభు, ఖనౌరీల వద్ద వేల సంఖ్యలో గుమిగూడి ఉన్నారు. వారు నిన్న ఢిల్లీ దిశగా తమ నిరసనను ఉద్ధృతం చేసేందుకు యత్నించారు.

Next Story