మరోసారి భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.!
Commercial gas cylinder price hike. కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు మరో సారి పెరిగాయి. దీంతో హోటళ్లపై, వ్యాపార అవసరాలపై పెను భారం పడింది.
By అంజి Published on 1 Dec 2021 10:39 AM ISTకమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు మరో సారి పెరిగాయి. దీంతో హోటళ్లపై, వ్యాపార అవసరాలపై పెను భారం పడింది. తాజాగా రూ.103.50లను కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్లపై పెంచారు. పెరిగిన ధరలు నేటి నుండి అమల్లోకి వస్తాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ల ధర రూ.2000.50గా ఉండగా.. పెరిగిన ధరతో ఢిల్లీలో ధర రూ.2,104కు చేరుకుంది. ముంబైలో రూ.101 పెరిగి 1950 రూపాయల ధరగా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.2,051 పెరిగింది. పెరిగిన ధరలతో కోల్‌కతాలో వాణిజ్య గాస్ సిలిండర్ ధర రూ.2,174.5 గా, చెన్నైలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.2,234.50 గా ఉంది.
అయితే గ్యాస్ కంపెనీలు గృహవినియోగ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను మాత్రం పెంచలేదు. దీంతో సామాన్యునికి ఊరట కలిగించింది. దేశ రాజధాని ఢిల్లీలో సబ్సిడీ లేని 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.899.50 గా ఉంది. చమురు కంపెనీలు ప్రతి నెల కొకసారి ధరలను మారుస్తుంటారు. అయితే తాజాగా పెరిగిన గ్యాస్ ధరలు పరోక్షంగా సామాన్యుడిపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. ఇళ్లలో వాడే డొమెస్టిక్ సిలిండర్ ధర చివరిసారిగా అక్టోబర్ 6వ తేదీన పెరిగింది. గత నెల, ఈ నెలలో కూడా గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.
హైదరాబాద్‌లో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.952గా ఉంది. 48 రూపాయలు పెంచితే గ్యాస్ సిలిండర్ ధర రూ.1000 మార్కును దాటుతుంది. ఈ సంవత్సరం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర 8 సార్లు పెరిగితే ఒకసారి ధర తగ్గింది. అయితే గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని పెంచబోతుందని వార్తలు వస్తున్నాయి. ఒక వేళ అదే జరిగితే వినియోగదారులు తమ గ్యాస్ సిలిండర్‌లను రూ.700 లోపే పొందవచ్చు.