అరెస్టయిన ముఖ్యమంత్రి తండ్రికి రాచమర్యాదలు
CM’s ‘arrested’ father eating lunch in a police chamber goes viral. అరెస్టు చేశాక ఎవరైనా ఒకటే.. కానీ సదరు ముఖ్యమంత్రి తండ్రికి రాచ మర్యాదలు చేశారు
By Medi Samrat
అరెస్టు చేశాక ఎవరైనా ఒకటే.. కానీ సదరు ముఖ్యమంత్రి తండ్రికి రాచ మర్యాదలు చేశారు. ఏసీ రూమ్ లో కూర్చోపెట్టి మరీ భోజనాలు చేయిస్తున్న ఫోటో వైరల్ అవుతోంది. బ్రాహ్మణ సామాజిక వర్గంపై వ్యాఖ్యలు చేసిన సీఎం భూపేష్ బాఘేల్ తండ్రి నందకుమార్ బాఘేల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను రాయ్ పూర్ కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి ఆయనకు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. దాంతో ఆయనను పోలీసులు జైలుకు తరలించారు. నంద్ కుమార్ బాఘేల్ బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలపై సర్వ్ బ్రాహ్మణ్ సమాజ్ సభ్యులు రాయ్‌పూర్‌లోని డీడీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బ్రాహ్మణులను విదేశీయులు అని.. వారిని బహిష్కరించాలని నంద్ కుమార్ బాఘేల్ ఇటీవల ప్రజలకు విజ్ఞప్తి చేశారని, వారిని తమ గ్రామాలలోకి అనుమతించవద్దని ప్రజలను కోరినట్లు సర్వ్ బ్రాహ్మణ్ సమాజ్ సంస్థ తన ఫిర్యాదులో తెలిపింది. ఆయనపై ఐపీసీ 153-ఏ, 505(1)(B) కింద కేసు నమోదు చేసినట్లు రాయ్‌పూర్ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆయనకు వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అతని అరెస్టుకు సంబంధించిన వార్తలు వెలువడిన వెంటనే పోలీస్ స్టేషన్‌లోని ఎయిర్ కండిషన్డ్ ఛాంబర్‌లో భోజనం చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడం ప్రారంభించింది. ఆయనకు పోలీసు స్టేషన్ లో ఫైవ్ స్టార్ సదుపాయాలను అందించారని విమర్శలు వస్తున్నాయి. బ్రాహ్మణ ఓటు బ్యాంకును వాడుకోడానికే తన తండ్రి అరెస్టును చేయవచ్చని చెప్పారని నెటిజన్లు విమర్శించారు. తన తండ్రి అరెస్టు అయ్యాక.. ఆయన్ను సామాన్యుడిగా మాత్రం పరిగణించలేదని.. అన్ని సదుపాయాలను ఇచ్చారని పలువురు నేతలు విమర్శించారు.