కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌.. వయోపరిమితి పెంచిన స‌ర్కార్‌..!

60,244 కానిస్టేబుల్ సివిల్ పోలీస్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో అన్ని కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో మూడేళ్ల సడలింపు..

By Medi Samrat  Published on  26 Dec 2023 3:19 PM GMT
కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌.. వయోపరిమితి పెంచిన స‌ర్కార్‌..!

60,244 కానిస్టేబుల్ సివిల్ పోలీస్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో అన్ని కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో మూడేళ్ల సడలింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. వయోపరిమితిలో సడలింపు కోసం అభ్యర్థుల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి.. ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని హోం ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ ప్రసాద్‌ను ఆదేశించారు. వయోపరిమితిలో సడలింపు కోసం కేంద్ర మంత్రి సంజీవ్ బల్యాన్, బీజేపీ ఎంపీ వీరేంద్ర సింగ్ మస్త్, పలువురు ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీల నేతలు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరిలు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్, ప్రమోషన్ బోర్డు ద్వారా జనరల్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి 18 నుండి 22 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. 2018 తర్వాత అంటే దాదాపు ఐదేళ్ల త‌ర్వాత‌ 60 వేల పోస్టులు భర్తీ కానున్నాయని నిరుద్యోగ‌ యువత వాదిస్తున్నారు. రిక్రూట్‌మెంట్‌లో ఐదేళ్ల జాప్యం కారణంగా.. చాలా మంది యువత వయోపరిమితిని దాటారు. దీని కారణంగా వ‌యోప‌రిమితి పెంచాల‌న్న డిమాండ్ ఉంది. అదే సమయంలో రిజర్వేషన్ల పరిధిలోకి వచ్చే ఇతర కేటగిరీల అభ్యర్థులకు కూడా వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. మరోవైపు బుధవారం నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుకు రిక్రూట్‌మెంట్ బోర్డు సన్నాహాలు పూర్తి చేసింది. తొలిరోజే అత్యధిక దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు.

ఇదిలావుంటే.. కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌కు రాత పరీక్ష నిర్వహించేందుకు కూడా అడ్డంకి ఏర్పడనుంది. వాస్తవానికి రిక్రూట్‌మెంట్ బోర్డు రాత పరీక్షకు ఫిబ్రవరి 11వ తేదీని ప్రతిపాదించి అన్ని జిల్లాల డీఎంలు, ఎస్పీలను సన్నద్ధం చేయాలని కోరింది. మరోవైపు ఫిబ్రవరి 11వ తేదీన రివ్యూ ఆఫీసర్, అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను నిర్వహిస్తోంది. దాదాపు 25 లక్షల మంది అభ్యర్థులు కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌కు హాజరుకానుండగా.. 10 లక్షల మంది అభ్యర్థులు కమిషన్ పరీక్షకు హాజరుకానున్నారు. ఈ పరిస్థితుల్లో రెండు పరీక్షలను ఒకేసారి నిర్వహించడం అధికారుల‌కు స‌వాల్‌గా మార‌నుంది. ముఖ్యంగా లక్షలాది మంది అభ్యర్థులు.. ఇతర జిల్లాలకు పరీక్షల కోసం వెళ్లడం వల్ల రవాణా సేవలపై తీవ్ర ప్రభావం పడుతుంది.

Next Story