మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. తన మంత్రివర్గ సహచరులతో కలిసి ఆనందంతో డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆదివారం నాడు సెహోర్ జిల్లా భిలాయ్ గ్రామంలో గిరిజనులకు అటవీ హక్కులకు సంబంధించిన లీజు సర్టిఫికెట్లను అందజేసిన కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ డ్యాన్స్ చేశారు. బీజేపీ శ్రేణులు ఉత్సాహపరుస్తుండగా.. ముఖానికి మాస్క్, సంప్రదాయ విల్లంబులు ధరించి స్టేజ్ పైనే నృత్యం చేశారు.
డిసెంబర్ 2006కు ముందు అడవుల్లో వ్యవసాయం చేస్తున్న వారందరికీ లీజు పట్టాలను శివరాజ్ సింగ్ చౌహాన్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీలకు గత పాలకులు ఏ విధమైన మేలునూ చేయలేదని, కాంగ్రెస్ నేతలే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. వారి భూములను కబ్జా చేసిందని, కోర్టు కేసుల్లో వారిని ఇరికించిందని, వారి ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుందని ఆయన దుయ్యబట్టారు. ఈ అన్యాయాన్ని తాము సరిదిద్దుతున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో సాగునీటి సౌకర్యాలు కల్పిస్తామని, పారిశ్రామిక సంస్థల్లో మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఓ పాలసీని తెస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా ప్రభుత్వం నుంచి తమకు లభించిన ఈ అనూహ్య వరం పట్ల భిలాయ్ గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.