20 ఏళ్ల తర్వాత హోంశాఖను వదులకున్న సీఎం నితీశ్ కుమార్
బీహర్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దాదాపు 20 ఏళ్ల తర్వాత కీలకమైన హెంశాఖను వదులుకున్నారు
By - Knakam Karthik |
20 ఏళ్ల తర్వాత హోంశాఖను వదులకున్న సీఎం నితీశ్ కుమార్
పాట్నా: బీహర్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దాదాపు 20 ఏళ్ల తర్వాత కీలకమైన హెంశాఖను వదులుకున్నారు. ఈ శాఖను బీజేపీ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి కేటాయించారు. బీహార్లో నితీశ్ కుమార్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. మంత్రులకు నితీశ్ కుమార్ శాఖల కేటాయింపు చేపట్టారు. శాఖల కేటాయింపునకు సంబంధించి శు క్రవారం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. మరో ఉప ముఖ్యమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ సిన్హాకు రెవెన్యూ, భూసంస్కరణలు, భూగర్భ గనుల శాఖను అప్పగించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన వద్ద సాధారణ పరిపాలన విభాగం, క్యాబినెట్ సెక్రటరియేట్, విజిలెన్స్ తదితర శాఖలను అట్టిపెట్టుకున్నారు. జేడీయూ, బీజేపీ పొత్తులో ఉన్న ప్రతిసారి బీజేపీకి ఆర్థిక శాఖ కేటాయిస్తారు. కానీ ఈసారి జేడీయూ సీనియర్ నేత బిజేంద్ర ప్రసాద్ యాదవ్‌కు ఆ శాఖను అప్పగించారు.
బీజేపీ నాయకులు కీలకమైన వ్యవసాయం (రామ్‌కృపాల్ యాదవ్), వెనుకబడిన తరగతుల సంక్షేమం (రామ నిశాద్), విపత్తు నిర్వహణ (నారాయణ ప్రసాద్), ఇండస్ట్రీస్ (దిలీప్ జైస్వాల్), లేబర్ (సంజయ్ సింగ్ టైగర్) శాఖలు పొందారు. మాజీ బీహార్ బీజేపీ చీఫ్ మంగళ్ పాండేకు ఆరోగ్య, న్యాయ శాఖలు రెండూ ఇచ్చారు.
ఇతర బీజేపీ మంత్రిత్వ శాఖల్లో రోడ్డు–హౌసింగ్ (నితిన్ నబీన్), ఎస్సీ-ఎస్టీ సంక్షేమం (లఖేంద్ర రౌషన్), టూరిజం (అరుణ్ శంకర్ ప్రసాద్), ఐటీ–క్రీడలు (శ్రేయసి సింగ్), చేపల & పశుసంవర్ధక వనరులు (సురేంద్ర మెహతా), పర్యావరణం–క్లైమేట్ చేంజ్ (ప్రమోద్ కుమార్) ఉన్నాయి.
జెడీయూకు సోషియల్ వెల్ఫేర్ (మదన్ సహ్ని), రూరల్ వర్క్స్ (అశోక్ చౌధరి), ఫుడ్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ (లేశీ సింగ్), గ్రామీణాభివృద్ధి–ట్రాన్స్‌పోర్ట్ (శరవణ్ కుమార్), వాటర్ రిసోర్సెస్ (వీకే చౌధరి), ఎనర్జీ (విజేందర్ యాదవ్), ఎడ్యుకేషన్ (సునీల్ కుమార్) శాఖలు దక్కాయి.
చిన్న మిత్ర పక్షాలకు చెరకు పరిశ్రమ, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ (లోక్ జనశక్తి పార్టీ), మైనర్ వాటర్ రిసోర్సెస్ (హిందుస్థాన్ అవామ్ మోర్చా), పంచాయతీరాజ్ (రాష్ట్రీయ లోక్‌మంచ్) శాఖలు కేటాయించారు.
నితీశ్ చేతుల నుంచి హోంమంత్రి శాఖ ఎందుకు?
నితీశ్‌కుమార్ 2005 నవంబర్ నుంచి బీహార్ హోమ్ డిపార్ట్‌మెంట్‌ను దాదాపుగా నిరంతరం తన వద్దే ఉంచుకున్నారు. 2014–15 మధ్యలో మాత్రమే జితన్ రామ్ మాంఝీ వద్దకు వెళ్లింది. ఇలాంటి కీలకమైన శాఖను ఈసారి బీజేపీకి అప్పగించడం, ఇద్దరి మధ్య ‘పెద్దన్న’ పాత్ర ఇప్పుడు బీజేపీకే అన్న సంకేతంగా భావిస్తున్నారు. 2020 ఎన్నికల్లో బీజేపీ 74 సీట్లు గెలిచి జెడీయూపై ఆధిపత్యం ప్రదర్శించింది. అప్పట్లో కూడా బీజేపీ సీఎం పదవి కోరుతుందన్న చర్చ సాగింది. కానీ చివరకు నితీశ్ సీఎం గానే కొనసాగి, రెండు డిప్యూటీ సీఎంలతో వ్యవహారం ముగిసింది.
ఐదేళ్ల తర్వాత పరిస్థితి మారింది. జెడీయూ మళ్లీ బలపడినా, బీజేపీనే కూటమిలో పెద్ద పార్టీగా నిలిచింది. తొలివిడత కేబినెట్‌లో బీజేపీకి 14, జెడీయూకు 9 స్థానాలు వచ్చిన విషయం కూడా అదే చెబుతోంది. హోం శాఖను సమ్రాట్ చౌధరీకి అప్పగించడం, 57 ఏళ్ల ఈ నేతను భవిష్యత్ వారసుడిగా తయారు చేసే చర్యగానూ భావిస్తున్నారు. ప్రచార సమయంలో నితీశ్ ఆరోగ్యం, వయస్సుపై ప్రతిపక్షం ప్రశ్నలు లేవనెత్తిన సందర్భంలో, ఆయనపై ఒత్తిడిని తగ్గించి గవర్నెన్స్‌పై మాత్రమే దృష్టి పెట్టేలా అవకాశం ఇచ్చినట్టుగా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.