ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వస్తున్నాయి : సీఎం కేసీఆర్
CM KCR Fire On Bjp Govt Against Delhi Ordinance. దేశ రాజధానిలో సేవల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్
By Medi Samrat Published on 27 May 2023 8:00 PM ISTదేశ రాజధానిలో సేవల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతు ఇచ్చారు. 'బీజేపీయేతర ప్రభుత్వాలను కేంద్రం పనిచేయనివ్వడం లేదు. ఢిల్లీలో ఆప్ చాలా ప్రజాదరణ పొందిన పార్టీ. మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. బీజేపీ అడ్డంకులతో చివరకు ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని తెలంగాణ సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశంలో అన్నారు. ‘‘అధికారులు గవర్నర్ చేతుల్లో కాకుండా.. ఢిల్లీ ప్రభుత్వం కింద పనిచేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ను కూడా కాలరాశారు. సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తూ భయంకరంగా ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చారు. ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు. ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. “మేమంతా అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతు ఇస్తున్నాము” అని అన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీ పరిపాలనను అడ్డుకుంటూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను సీఎం అరవింద్ కేజ్రీవాల్ తప్పుపట్టారు. ఇది ఢిల్లీ సమస్య కాదు.. ఇది ప్రజల సమస్య అని పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన తర్వాత నిర్వహించిన ప్రెన్‌కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీకి సహకారం అందించిన తెలంగాణ సీఎంకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ ప్రజల తరపున తాను ధన్యవాదలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.
ఫిబ్రవరి 2015లో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. మే నెలలో మోదీ సర్కార్ ఓ నోటిఫికేషన్ తెచ్చి తమ ప్రభుత్వాన్ని కూల్చారన్నారు. సర్వీస్ సంబంధిత విషయాల్లో గతంలో షీలా దీక్షిత్ వద్ద కంట్రోల్ ఉండేదన్నారు. తాము 8 ఏళ్లు పోరాటం చేశామని, మే 11వ తేదీన ఢిల్లీ ప్రజల తరపున అనుకూల తీర్పు వచ్చిందని, కానీ 8 రోజుల్లో వ్యతిరేక ఆర్డినెన్స్ తీసుకువచ్చిన ఢిల్లీ అధికారాల్ని మోదీ సర్కార్ లాగేసుకున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పక్కనపెట్టేసి… ఆర్డినెన్స్ తేవడం అంటే న్యాయం కోసం ప్రజలు ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా తాను ప్రజల తరపున తిరుగుతున్నట్లు ఆయన చెప్పారు. ఒకవేళ గవర్నరే పాలన చేయాలనుకుంటే, అప్పుడు ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సి అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. నాన్ బీజేపీ పార్టీలు అన్ని ఒక్కటి అయితేనే బీజేపీ ఢీకొట్టగలమన్నారు. దేశ ప్రజల్లో విశ్వాసం నింపాలన్నారు. ఆజాదీని రక్షించుకోవాలంటే మోదీని ఓడించాలని కేజ్రీ పిలుపునిచ్చారు.