గుడ్‌న్యూస్ : విద్యుత్ ఛార్జీలను త‌గ్గించిన‌ సీఎం

CM Channi's gift to public, made this big announcement. పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ నేతృత్వంలోని

By Medi Samrat  Published on  16 Jan 2022 4:12 PM IST
గుడ్‌న్యూస్ : విద్యుత్ ఛార్జీలను త‌గ్గించిన‌ సీఎం

పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల‌ను యూనిట్‌కు రూ.3 తగ్గించింది. ఈ మేర‌కు అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ముఖ్యమంత్రి చన్నీ తీసుకున్న నిర్ణ‌యాన్ని షేర్ చేసింది పంజాబ్ కాంగ్రెస్‌. గోశాలలకు విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని ముఖ్యమంత్రి చన్నీ నిర్ణయించారు. అన్ని గోసంరక్షణ కేంద్రాలకు సోలార్ సిస్టమ్‌ల ఏర్పాటుకు ఒక్కొక్కటికి రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించారు.

మళ్లీ అధికారంలోకి వస్తే ఏడాదిలోపు నిరుద్యోగుల‌కు లక్ష ఉద్యోగాలు ఇస్తామని.. చ‌దువుకున్న అభ్యర్థులకు విదేశాలకు వెళ్లే కార్యక్రమం చేపడతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఓ ప్రైవేట్ యూనివర్శిటీలో యువత కోసం ఉపాధి హామీ పథకం (PRAGTY) ప్రారంభించిన ఆయ‌న‌.. 12వ‌ తరగతి పాసైన యువత ఉద్యోగాలకు అర్హులని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోగా ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారం విడుదల చేసింది. ఈ జాబితాలో 86 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ఫిబ్రవరి 14న పంజాబ్‌లో ఎన్నికలు జ‌రుగ‌నున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. సీఎం చన్నీ మరోసారి చమ్‌కౌర్ సాహిబ్ అసెంబ్లీ స్థానం నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అమృత్‌సర్ తూర్పు నుంచి పోటీ చేయనున్నారు.


Next Story