అమరీందర్ సింగ్ రాజీనామా కన్ఫర్మ్ అయింది..!
CM Capt Amarinder resigns. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు
By Medi Samrat Published on 18 Sept 2021 5:09 PM ISTపంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆయన రాజీనామా చేయబోతున్నారని నేషనల్ మీడియా తెలిపింది. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌సింగ్, పీసీసీ చీఫ్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూ మధ్య విభేదాలు చివరికి ముఖ్యమంత్రి రాజీనామా దాకా వెళ్ళింది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం 5.00 గంటలకు సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి హరీష్ రావత్ తెలిపారు. పలువురు పంజాబ్ ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఏఐసీసీ ఇవాళ సీఎల్పీ సమావేశం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని ఆయన ట్వీట్ చేశారు.
అమరీందర్ సింగ్ తాను ముఖ్యమంత్రి కొనసాగలేనంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. ఇన్నాళ్లూ అన్ని రాజకీయ మార్పులను అంగీకరించానని కానీ ఇకపై పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. ఈ అవమానాలు చాలని , ఇలా జరగడం ఇది మూడోసారని సింగ్ ఆవేదన వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పీసీసీ చీఫ్ నవజ్యోత్ సిద్ధూ శనివారం సాయంత్రం సీఎల్‌పీ సమావేశానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకొన్ని నెలలే ఉన్న సందర్బంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పులు జరుగుతాయనే ఊహాగానాలకు ఈ సమావేశం తెరలేపింది. ఈ నేపథ్యంలో సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. 'ఇంతటి అవమానాన్ని నేను భరించలేను. ఈ అవమానాలు ఇక చాలు. ఇది మూడోసారి. ఇలాంటి అవమానాలతో నేను పార్టీలో ఉండాలనుకోవడం లేదు' అని సోనియా గాంధీతో చెప్పినట్లు తెలుస్తోంది. అమరీందర్ సింగ్ తన అనుచరులతో కలిసి పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.