బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లోని విద్యా సంస్థలు మూసివేశారు. ఇవాళ భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరికలు జారీ చేయడంతో.. గౌతమ్ బుద్ధ్ నగర్, ఘజియాబాద్, లక్నో, అలీఘర్, ఆగ్రా, ఇటా, మెయిన్‌పురి, ఫిరోజాబాద్, కాన్పూర్ సహా15కి పైగా జిల్లాల్లోని 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
అలీఘర్ జిల్లా మేజిస్ట్రేట్ ఇంద్ర వీర్ సింగ్ ఒక ప్రకటన ద్వారా అలీఘర్ ముస్లిం యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న అన్ని పాఠశాలలను మూసివేయాలని ప్రకటించారు. కాన్పూర్‌లో, 12వ తరగతి వరకు ఉన్న పాఠశాలలు సోమవారం మూసివేయబడతాయని, మెయిన్‌పురిలో సోమవారం, ఫిరోజాబాద్‌లో సోమవారం, గురువారాల్లో అన్ని పాఠశాలలు మూసివేయబడతాయని డీఎమ్ విశాఖ్ జి అయ్యర్ తెలిపారు. సోమ, మంగళవారాల్లో రెండు రోజుల పాటు స్కూళ్లను మూసివేయాలని అలీఘర్, మథుర, ఎటా జిల్లా యంత్రాంగం ఆదేశించింది.
భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో ఎడితెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. భారీ వరదలతో రోడ్లన్నీ నీట మునిగాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇవాళ కూడా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. భారీ వర్షాలు కురుస్తాయని.. 11 రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.