బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత
Chinchwad MLA Laxman Jagtap passes away aged 59. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే లక్ష్మణ్ జగ్తాప్ (59) మంగళవారం కన్నుమూశారు.
By Medi Samrat Published on 3 Jan 2023 3:35 PM IST
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే లక్ష్మణ్ జగ్తాప్ (59) మంగళవారం కన్నుమూశారు. ఏప్రిల్ 2022లో జగ్తాప్ ఆరోగ్యం క్షీణించింది. ఆయన చాలా రోజులుగా ఐసీయూలో ఉన్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన.. చాలా కాలంగా చికిత్స పొందుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈరోజు సాయంత్రం 7 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1986లో జరిగిన తొలి పీసీఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా ఎన్నికై.. ఆ తర్వాత 2006 వరకు పలుమార్లు గెలిచారు. జగ్తాప్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఆదేశించారు. ఏక్‌నాథ్ షిండే.. ఇటువంటి సమయంలో జగ్తాప్ కుటుంబానికి ఆ దేవుడు బలం చేకూర్చాలని ట్విట్టర్‌లో ఆకాంక్షించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పింపుల్ గురవలోని ఎమ్మెల్యే లక్ష్మణ్ జగ్తాప్ నివాసానికి తుది నివాళులర్పించేందుకు సీఎం ఏక్‌నాథ్ షిండే వెళ్లనున్నారు.
జగ్తాప్ చించ్వాడ్ అసెంబ్లీ స్థానం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు దశాబ్దాల క్రితం పింప్రి-చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్‌గా జగ్తాప్ తొలిసారిగా ఎన్నికయ్యారు. ఆయన 2000 సంవత్సరంలో పింప్రి-చించ్వాడ్ మేయర్ అయ్యారు. 2004లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ జగ్తాప్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికయ్యారు. జగ్తాప్ 2009లో కొత్తగా ఏర్పడిన చించ్వాడ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అయ్యారు. 2014 లోక్‌సభ ఎన్నికలలో మావల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి శివసేన అభ్యర్థి శ్రీరంగ్ బర్నే చేతిలో ఓడిపోయారు. అనంతరం 2019 ఎన్నికల్లో జగ్తాప్ మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.